తిరుమలగిరి మార్చి 25: మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద తిరుమలగిరి మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేసింది. ఈ పథకం కింద వాటర్ ట్యాంకులు, సంపులు, పైపులైన్లు నిర్మించాల్సి ఉంది. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో 2024 జూన్లో ఈ పథకం ప్రారంభమైనా..నేటికి పనులు పూర్తి కాలేదు. దీంతో వేసవిలో తాగునీటి కష్టాలు తప్పేలా లేవు.
ఏడాది లోపే పనులు పూర్తి కావాల్సి ఉన్నా..
జిల్లాలోని సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో అమృత్ 2.0 పథకం కింద పనులు చేపట్టేందుకు రెండేండ్ల క్రితం నిధులు మంజూరయ్యాయి. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో వాటర్ ట్యాంకులు, తాగునీటి సరఫరా కోసం పైపులైన్లు, నీటి సంపులు నిర్మిస్తున్నారు. 2024లో పనులు ప్రారంభించారు. ఏడాది లోపే పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. నేటీకి పూర్తి కాలేదు. పనులు నత్తనడక సాగుతున్నాయి.
నిర్మాణ దశలోనే ట్యాంకుల పనులు..
ఇప్పటి వరకు జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో 50శాతం కూడా పనులు పూర్తికాలేదు. అమృత్ 2.0 కింద ఆయా మున్సిపాలిటీల్లో మంజూరైన నిధులు చూస్తే తిరుమలగిరికి రూ .30 కోట్లు, నేరేడుచర్లకు రూ.11 కోట్లు, కోదాడకు రూ.2.5 కోట్లు, సూర్యాపేటకు రూ.30 కోట్లు మంజూరు అయ్యాయి. తిరుమలగిరి మున్సిపాలిటీలో 5 తాగునీటి ట్యాంకులు, సూర్యాపేటలో 5 ట్యాంకులు, కోదాడలో 3 ట్యాంకులు, నేరేడుచర్లలో 3 ట్యాంకులు నిర్మిస్తున్నారు. ఇవి ప్రస్తుతం నిర్మాణ దశలోనే ఉన్నాయి. దీంతో ఈసారి కూడా వేసవిలో తాగునీటి ఇబ్బందులు తప్పవు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే జాప్యం..
ఈ పథకం కింద చేపడుతున్న పనుల్లో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పనులు నేటికీ పూర్తి కాలేదు. పనులు చేపట్టడంలో కాంట్రాక్టర్లు తీవ్ర జాప్యం చేస్తుండగా పర్యవేక్షిస్తున్న అధికారులు సైతం పట్టించుకోకపోవటంతో పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి పనులు త్వరగా పూర్తి చేసి మున్సిపాలిటీల్లో తాగునీరు అందేవిధంగా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.