తుంగతుర్తి, డిసెంబర్ 29 : తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రం నుండి మద్దిరాల మండలం వెళ్లే ప్రధాన రహదారి పనులు వెంటనే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు అన్నపర్తి జ్ఞాన సుందర్ డిమాండ్ చేశారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుంగతుర్తి నుండి మధిరాలకు వెళ్లే ప్రధాన రహదారి కాంట్రాక్టర్ రోడ్డును తవ్వి కంకర, డస్ట్ పోసి నాలుగు నెలలు కావస్తున్నా పనులు పూర్తి చేయకుండా ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో గాలికి దుబ్బ లేవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఆర్ అండ్ బి అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ.జాన్, కటకం కృష్ణయ్య, బత్తుల జలంధర్, కటకం సూరయ్య, ప్రతాప్, మహిళలు పాల్గొన్నారు.