యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : నేత కార్మికులకు ఉన్న ఒకగానొక చేనేత పొదుపు పథకం కొనసాగుతుందా? కార్మికులకు ఆసరాగా నిలిచే స్కీమ్‌ను కాంగ్రెస్ సరారు ఏం చేస్తుంది? అనే సందేహాలతో నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. చేనేత కార్మికుల కోసం బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చి సమర్ధవంతంగా అమలు చేసిన త్రిఫ్ట్ సీమ్‌పై ప్రస్తుతంనీలినీడలు కమ్ముకున్నాయి. పథకం గడువు ముగిసిన నాలుగు నెలలు కావస్తున్నా కొనసాగింపు ఊసు లేకపోవడమే ఇందుకు కారణం.
పొదుపు పథకానికి కేసీఆర్ శ్రీకారం..
నేతన్నలను బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటూ అండగా నిలిచింది. ఉపాధి లేక వలసలు వెళ్లిన కార్మికులకు చేయూతనిచ్చింది. నేతన్నల సామాజిక భద్రత కోసం అప్పటి సీఎం కేసీఆర్ చేనేత పొదుపు పథకానికి శ్రీకారం చుట్టారు. నేత కార్మికుల నెలవారీ ఆదాయంలో 8 శాతం ఆర్డీ1లో జమ చేసిన తర్వాత.. ప్రభుత్వం ఆర్డీ2లో 15 శాతాన్ని నేరుగా జమ చేసేది. ఆ మొత్తం నగదును వడ్డీ సహా మూడేండ్ల తర్వాత కార్మికులను అందించేది. అంతకుముందు 2018-2021లో ఒక దఫా ఈ విధంగా లబ్ధిదారులు సాయం పొందారు. 2021-2024 సంవత్సరానికి గానూ ఆగస్టు 31న పథకం గడువు ముగిసింది.
11వేల కుటుంబాలకు ఆసరా..
2021-2024 సంవత్సరానికి గానూ యాదాద్రి భువనగిరి జిల్లాలో 11 వేల మంది కార్మికులు నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డబ్బులు జమ చేయడంలో ఆలస్యం చేసింది. సుమారు 11 నెలల పాటు నెలనెలా డబ్బులు చెల్లించడం నిలిపేసింది. దాంతో రూ.25 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. కార్మికులు మాత్రం తమ వాటాను క్రమం తప్పకుండా కట్టారు. ఆఖరికి పథకం గడువు ముగియడంతో చేనేత వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో చేసేది లేక నిధులు విడుదల చేసింది. దాంతో జిల్లాలో సుమారు 11వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరింది. వాటాను బట్టి ఒకొకరికి 2 లక్షల నుంచి మూడు లక్షల వరకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.
పథకాన్ని కొనసాగించేనా?
ఈ ఏడాది ఆగస్టు నెలలో చేనేత పొదుపు పథకం గడువు ముగిసింది. బీఆర్ఎస్ హయాంలో గడువు ముగియగానే కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం ఇప్పటివరకూ స్పష్టత లేదు. పథకం గడువు ముగిసి నాలుగు నెలలు అవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు. తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదని చేనేత, జౌళి శాఖ అధికారులు చెబుతున్నారు. దాంతో నేతన్నలు పథకం ఉంటుందా, లేదా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలో చేనేత మిత్ర బంద్ ..
నేత కార్మికుల కోసం నాడు కేసీఆర్ చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చారు. దీని కింద నేత కార్మికులకు రసాయనాలు, నూలుపై 40శాతం రాయితీ కల్పించారు. కొందరికి అవగాహన లేకపోవడం, సబ్సిడీ పొందే ప్రక్రియ తెలియకపోవడంతో దానిని పొందలేకపోయారు. దీని స్థానంలో మగ్గం మీద పని చేసే ప్రతి కార్మికుడికి నెలనెలా రూ. 3వేల ఆర్థిక సాయం చేయాలని భా వించారు. నేత కార్మికుల బ్యాంకు ఖాతాలో రూ.3వేల చొప్పున జమ చేశారు. ఇందులో నేత కార్మికుడికి రూ.2వేలు, అనుబంధ కార్మికులకు వెయ్యి ఖాతాల్లో వేశారు. కానీ కాంగ్రెస్ సరారు వచ్చాక ఒక పైసా కూడా ఇవ్వలేదు. నెల నెలా ఆర్థిక తోడ్పాటును అందించే పథకాన్ని ప్రశ్నార్థకం చేశారు.
చేనేత పొదుపు పథకాన్ని కొనసాగించాలి
నేత కార్మికులకు ఎంతో ఉపయోగకరమైన చేనేత పొదుపు పథకాన్ని కొనసాగించాలి. కేసీఆర్ గవర్నమెంట్లో చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిండ్రు. ఇప్పుడు పథకం గడువు అయిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చేనేత కార్మికులందరినీ దృష్టిలో పెట్టుకొని పథకాన్ని కొనసాగించాలి.
-బడుగు సత్యనారాయణ, చేనేత కార్మికుడు, భూదాన్‌పోచంపల్లి
లక్షా 20వేల రూపాయలు వచ్చినయ్
మూడు సంవత్సరాలు పొదుపు పథకం కింద కడితే లక్షా 20 వేలు వచ్చినయి. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ సీమ్ గురించే మాట్లాడుతలేరు. మా కుటుంబానికి మగ్గమే ఆధారం. కరోనా సమయంలో కూడా ఎంతో ఆసరా అయ్యింది. నెలనెలా మేం డబ్బులు జమ చేసుకునేది. ఇప్పుడు ఆ సీమ్ లేకపోయె. ప్రభుత్వం మా గురించి ఆలోచన చేస్తలేదు. చేనేత కార్మికులకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు పెట్టిన పొదుపు పథకాన్ని కొనసాగించాలి.
-కుడికాల సుదర్శన్, చేనేత కార్మికుడు, భూదాన్‌పోచంపల్లి