నీలగిరి, మార్చి 6 : నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో నాలుగేండ్ల బాలుడు కిడ్నాప్‌నకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. భిక్షాటన చేస్తూ జీవనం సాగించే అహ్మద్, షహమున్నీసా బేగం దంపతులు జనరల్ ఆస్పత్రి ఆవరణలోని షెడ్డులో మూడేండ్లుగా ఉంటున్నారు. వీరికి మూడేండ్ల కుమారుడు అబ్బు ఉన్నాడు. ఈ నెల 4న మధ్యాహ్నం నుంచి అబ్బు కనిపించడం లేదు. చుట్టుపక్కల వెతికినా దొరక్క పోవడంతో తల్లిదండ్రులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దవాఖాన ఆవరణలో సీసీ ఫుటేజీ పరిశీలించగా.. అబ్బును ఓ వ్యక్తి మాయమాటలు చెప్తూ, ఫోన్‌తో ఆడిస్తూ ఎత్తుకెళ్లడం గుర్తించారు.
దాంతో రైల్వేస్టేషన్, బస్టాండ్ ఆవరణలో సీసీ ఫుటేజీలను పరిశీలించినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టిన పోలీసులు బాలుడు నకిరేకల్ ఉన్నట్లు గుర్తించారు. నార్కట్‌పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన కూలీ సీతారాములు సోదరి నకిరేకల్‌లో నివాసం ఉంటున్నది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. కొడుకు లేడని తరచూ బాధ పడుతుండడంతో ఒక బాబును కిడ్నాప్ చేసి ఆమెకు ఇవ్వాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో నివాసం ఉంటున్న అహ్మద్, షహమున్నీసా కుమారుడు అబ్బును ఎత్తుకెళ్లేందుకు పది రోజులపాటు రెక్కీ వేసి మంగళవారం కిడ్నాప్ చేసి తన సోదరికి ఇచ్చాడు. పోలీసులు గురువారం రాత్రి బాలుడిని తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. సీతరాములును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఫిర్యాదు అందిన 24గంటల్లో బాలుడిని అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఓ కుటుంబం మూడేండ్లుగా ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ఉంటున్నా సిబ్బంది గుర్తించకపోవడం గమనార్హం.