ఆత్మకూర్ ఎస్, మార్చి 14 : ఆ కుటుంబంలో ప్రాథమిక విద్యను కూడా ఎవరూ పూర్తి చేయలేదు. చదువుకునే వారికి సరైన చేయూతనిచ్చే వారు లేరు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా శ్రమించి ఒకటి కాదు, రెండు కాదు మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు ఆ యువకుడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం గట్టిగల్లు గ్రామానికి చెందిన రోజువారి కూలీలు కోన లింగయ్య-పద్మ దంపతుల ప్రథమ పుత్రుడు సతీశ్. టీఎస్పీఎస్సీ శుక్రవారం విడుదల చేసిన గ్రూప్ -3 ఫలితాల్లో స్టేట్ 211 ర్యాంక్ సాధించాడు.
సతీశ్ గత 8 ఏళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. ఉన్నత ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ప్రిపరేషన్‌ను కొనసాగించాడు. దీంతో గత సెప్టెంబర్ లో విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో సెలక్ట్ అయ్యాడు. తాజాగా గ్రూప్ 3లో ర్యాంక్ సాధించాడు. సతీశ్‌కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకవైపు కుటుంభ బాధ్యతలు, మరోవైపు ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.