నకిరేకల్, అక్టోబర్ 11 : నకిరేకల్ మండలంలో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పంటను తీసుకొచ్చిన అన్నదాతలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరిగోసపడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పంటను పండించిన రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. నకిరేకల్ మండలంలో చీమల గడ్డ (దొడ్డు), చీమల గడ్డ (సన్న), చందుపట్ల, నెల్లిబండ, తాటికల్లు పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
ఈ పిఎసిఎస్ సెంటర్లలో కొందరు సెంటర్ నిర్వాహకులు రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సమస్యలు ఏవైనా విలేకరులకు, అధికారులకు చెప్తే ధాన్యం కొనుగోలు చేయమని బహటంగానే బెదిరిస్తున్న సందర్భాలు ఉన్నాయి. కొంతమంది సెంటర్ ఇన్చార్జీలు తమ మనుషులను సెంటర్లలో పెట్టుకుని వారితో ఇతర రైతులను భయపెడుతూ ఏ సమస్య వచ్చినా ఇటు విలేకరులకు గాని, అటు జిల్లా అధికారులకు గానీ చెప్పొద్దు అని హుకుం జారీ చేయిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా చెప్తే ధాన్యం కొనబోమని హెచ్చరిస్తున్నారు. మీడియాకు చెబితే అస్సలు కొనమని చెప్పే పరిస్థితి నెలకొంది. ధాన్యం తడిచినా, టార్పాలిన్లు ఇయ్యకున్నా, సౌకర్యాలు లేకున్నా చెప్పొద్దని కొంతమంది ఇన్చార్జీలు రైతులకు హుకుం జారీ చేస్తున్నారు. పిఎసిఎస్ కేంద్రాలలో రైతులు దాన్యం అమ్ముకోవాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నోరు విప్పితే ఎప్పుడు ఏం జరుగుతుందోనని రైతులు భయపడుతున్నారు. అధికారులకు గానీ, విలేకరులకు గాని ఎవరైనా రైతులు తమ గోడు వెల్లబోసుకుంటే ఆ రైతులను ధాన్యం వివరాలను ట్యాబ్ లో ఎంటర్ చేయకుండా, లారీలు ఎత్తకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సివిల్ సప్లై అధికారులు గానీ, కో-ఆపరేటివ్ అధికారులు గానీ, మార్కెటింగ్ శాఖ అధికారులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ, వ్యవసాయ శాఖ అధికారులు గానీ పట్టించుకోకపోవడం గమనార్హం.
జిల్లా అధికారులు వచ్చి హడావుడిగా తనిఖీ చేసి తమ సమస్యలు తెలుసుకోకుండా సెంటర్ ఇన్చార్జిలు చెప్పిందే వేదంగా భావించి వెళ్లిపోతున్నారని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ.. పిఎసిఎస్ సెంటర్లో ఒక రైతు తమ సెంటర్ ఇన్చార్జి కొనుగోలు కేంద్రానికి వద్దంటే వద్దు అంటూ నమస్తే తెలంగాణకు తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ప్రతి సీజన్లో సీరియల్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, రాత్రికి రాత్రి బస్తాలు మాయం చేస్తున్నాడని, సెంటర్ ఇన్చార్జి లేకుండా బయట వ్యక్తులను పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేసి అడ్డగోలుగా సెంటర్ నిర్వహిస్తున్నాడని ఆరోపించాడు. కొంతమంది సెంటర్ ఇన్చార్జిలు పిఎసిఎస్ సెంటర్లలో పదిమంది ప్రైవేటు వ్యక్తులను పెట్టి ఇటు అధికారులకు, అటు విలేకరులకు సమస్యలు ఏం లేవని వారితో చెప్పిస్తున్న సందర్భాలు లేకపోలేదు. దీంతో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే వెళ్లిపోతున్న సందర్భాలు ఉన్నాయి. మండల స్థాయి నియోజకవర్గస్థాయి జిల్లా స్థాయి అధికారులను శాసించే పరిస్థితి నకిరేకల్ ప్రాథమిక సహకార సంఘం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలకు ఉందంటే అతిశయోక్తి కాదు. రైతుల దయనీయమైన పరిస్థితిపై డిఎస్ఓ, డిసిఒ, డిఎం, కలెక్టర్ ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.