మిర్యాలగూడ, జనవరి 10 : సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే తమ విలువైన సామాన్ల భద్రతలో జాగ్రత్తలు పాటించాలని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణతో కలిసి దొంగతనాల నివారణపైన రూపొందించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. పండుగలకు ఇతర ఊర్లకు వెళ్లేవారు ప్రధాన గేటుకు తాళం వేసి వెళ్లకూడదని దీనివల్ల దొంగతనం చేసే వారికి దొంగతనం చేయడం సులువుగా మారుతుందన్నారు. ఇంటి ప్రధాన ద్వారానికి నాణ్యమైన తాళాన్ని వేసుకుని తాళం కనిపించకుండా కర్టెన్ వేసి ఉంచాలన్నారు. విలువైన వస్తువులు నగదు ఉన్నట్లయితే అవకాశం ఉన్నవారు బ్యాంక్ లాకర్లలో, లేదా నమ్మకమైన బంధువుల వద్ద ఉంచి వెళ్లాలని సూచించారు.
ఊర్లకు వెళ్లేవారు విషయాన్ని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారం అందిస్తే ఆ ఏరియాలలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తామని తెలిపారు. కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు జరిగే పరిస్థితి ఉండదన్నారు. రైలులో, బస్సులు ప్రయాణించేప్పుడు అపరిచితులు ఏమైనా తినుబండారాలు ఇస్తే తీసుకోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు వెంకట నరసయ్య, నాగభూషణ్ రావు, పి ఎం డి ప్రసాద్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.