– బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి
– కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన
– ప్రధాన రహదారి నుండి డీఎస్పీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ
కోదాడ, నవంబర్ 18 : సీఎం రిలీఫ్ ఫండ్ అవినీతి వ్యవహారంలో పోలీసులు రిమాండ్‌కు పంపిన కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేశ్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ మృతి పట్ల పలు అనుమానాలు ఉన్నాయని, న్యాయ విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజేశ్ తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, ధర్మ సమాజ్ పార్టీ బాధ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు మంగళవారం ప్రధాన రహదారి నుండి డీఎస్పీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం డీఎస్పీ శ్రీధర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాజేశ్ తల్లి మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ నగదు విషయంలో తన కుమారుడిని ఈ నెల 4వ తేదీన చిలుకూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేసి రిమాండ్ చేసి 8వ తేదీ వరకు హుజూర్నగర్ జైలుకు పంపినట్లు తెలిపారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న తన కుమారుడిని వైద్యం కోసం హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించి ఆదివారం శవంగా అప్పగించారని ఆమె ఆవేధన వ్యక్తం చేసింది. తన కుమారుడి మృతి పట్ల పలు అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే తన కుటుంబాన్ని పోషించే తన పెద్ద కొడుకు లేకపోవడంతో కుటుంబం రోడ్డున పడిందని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ రాజును కోరింది. ఆర్డీఓ స్పందిస్తూ.. రాజేశ్ మృతి చాలా బాధాకరమన్నారు. కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కోదాడ మున్సిపాలిటీలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగంతో పాటు, కొంత ఆర్థిక సాయం అందించేందుకు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడతానని భరోసా ఇచ్చారు. డీఎస్పీ, ఆర్డీఓ భరోసా మేరకు ఆందోళన విరమించారు. కాగా తక్షణ ఖర్చులకు కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు రూ.50 వేలు రాజేశ్ కుటుంబానికి అందిస్తానని హామీ ఇచ్చారు.

Kodada : ‘రాజేశ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి’