పాలకవీడు, నవంబర్ 19 : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పట్టుదల, కృషితోనే నేడు రాష్ట్రంలో ఇంత ధాన్యం దిగుబడి అవుతున్నదని, దానిని కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పాలకవీడు బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కిష్టపాటి అంజిరెడ్డి మాతృమూర్తి కిష్టపాటి కామేశ్వరమ్మ ఇటీవల మృతి చెందగా మంగళవారం గుడుగుంట్ల పాలెంలో ఆయనను పరామర్శించి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి నిత్యం ఎంత ధాన్యం కొనుగోలు చేశామనే విషయమై మాజీ సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించేవారని, కానీ నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు.
రాష్ట్ర మంత్రులు చెబుతున్న ధాన్యం లెక్కలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ధాన్యం పండింది, ఎంత కొనుగోలు చేశామో చెప్పే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. కనీసం సివిల్ సప్లయ్ అధికారులు కూడా బహిరంగంగా చెప్పలేని పరిస్థితి ఉందని తెలిపారు. అబద్ధాలతో కాలం వెల్లబుచ్చుతున్నారే తప్ప ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. కాళేశ్వరం నీటితో సంబంధం లేకుండానే ఇంత పంట పండిందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల చిల్లర మాటలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎల్లంపల్లి నుంచి పైకి వచ్చిన ప్రతి చుక్క నీరు కూడా కాళేశ్వరంలో భాగంగా కేసీఆర్ తీయించిన కాల్వలు, డ్యామ్‌లు, సొరంగాలే, బాహుబలి మోటర్లే ద్వారానేనని తెలిపారు.
ఏడాది గడిచినా నీటి పారుదల శాఖ మంత్రికి ఏ కాల్వ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదన్నారు. సూర్యాపేట జిల్లాలోని చాలా మండలాల్లో కాళేశ్వరం నీళ్లు పారుతున్నాయని తెలిపారు. వ్యవసాయంపై అనుభవం లేని రేవంత్‌రెడ్డి సీఎం కావడం, మంత్రులు కూడా ఉండడం బాధాకరమని ఎద్దేవా చేశారు. కనీసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు వ్యవసాయంపై అనుభవం ఉన్నప్పటికీ ఆయన కూడా మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎవరు మాట్లాడినా ఇప్పటి వరకు ఎన్ని లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరించారనే విషయం చెప్పలేక పోతున్నారని విమర్శించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆదుకోవడం వల్లనే వారి మోహంలో నవ్వు కనిపించిందని, కానీ ఇప్పుడు రైతుల మోహంలో ఆ నవ్వు కనిపించడం లేదని తెలిపారు. ఇప్పటికే రైతు బంధు, రైతు భరోసా కలిపి సుమారు రూ. 20 వేల కోట్లు ఎగగొట్టారన్నారు. రుణమాఫీ మొదటిసారి రూ. 12వేల కోట్లు, రెండోసారి కేవలం రూ. 150 కోట్లు మాత్రమే మాఫీ చేశారని తెలిపారు. ఇప్పటికీ ముఖ్యమంత్రికి వ్యవసాయంలో ఏం జరుగుతుందో తెలియదని, మంత్రుల పరిస్థితి కూడా అదే తీరుగా ఉందని చెప్పారు. అధికారులను పిలిచి ఏవో కాకి లెక్కలు వేసి చేతులు దులుపుకుంటున్నారని, అబద్ధాలతో పొద్దుగూకదని, మళ్లీ సూర్యుడు వస్తాడు.. వెలుతురు వస్తుందని తెలిపారు.
బీఆర్ఎస్ నాయకులు రైతుల పక్షాన పోరాడుతారని, తాము అడిగే వరకు అధికారులు ఎవరు కూడా మిల్లర్లను మద్దతు ధరపై ప్రశ్నించలేదన్నారు. మంత్రులు కొంత మంది మిల్లర్లతో కుమ్మక్కు కావడంతో మిల్లర్లు రైతులు దోచుకుంటున్నారని ఆరోపించారు. సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ ప్రతి రోజూ అధికారులతో సమావేశం నిర్వహించాలని కోరారు. హుజూర్నగర్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది ఇక్కడి రైతులే, అలాంటి వారికి అన్యాయం జరురకుండా చూడాల్సిన బాధ్యత తమదేనని సూచించారు. ఇప్పటికైనా మంత్రులు రైతుల బాదలను అర్థం చేసుకోవాలని, కేసీఆర్‌పైన, కాళేశ్వరంపైన బురద జల్లడం మానుకోవాలని తెలిపారు. అనంతర శూన్యపహాడ్ గ్రామంలో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సఫావత్ చిన్నీ చిత్రపటానికి జగదీశ్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒంటెద్దు నర్సింహా రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, నేరేడుచర్ల బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్‌బాబు, మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, హుజూర్నగర్ మాజీ జడ్పీటీసీ కొప్పల సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్రావు, కార్మిక సంఘం నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిపాల ఉపేందర్, బీఆర్ఎస్ నాయకులు మారిపెద్ది శ్రీను, ఎల్లబోయిన లింగయ్య, తాటికొండ వెంకట్‌రెడ్డి, రాపోలు నవీన్, గౌష్, అనంతు శ్రీను, ముల్కలపిల్లి రాంబాబు, పసుపులేటి సైదులు, నాగరాజు, అశోక్‌నాయక్, లక్ష్మీనారాయణ, భిక్షం, సుదర్శన్, శంకర్ నాయక్ పాల్గొన్నారు.