మోతె, మార్చి 12 : ఇకనైనా కాళేశ్వరం నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, అలాగే ఎండిన పంట పొలాలకు నష్ట పరిహారం చెల్లించాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్భంధం చేస్తామని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం మోతే మండల పరిధిలోని బిగ్యతండా, రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామాల్లో నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను వారు పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎండిన పంట పొలాలకు అంచనా వేసి ప్రతి ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు అని కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు. కానరాని ఎస్సారెస్పీ నీళ్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రైతులను ఆదుకోవాలన్నారు. సాగునీళ్లు అందగా పంటలు ఎండిపోవడంతో అన్నదాతలు ఆందోళన గురవుతున్నాన్నారు. పంట పొలాలు ఎండిపోతుంటే కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతుండగా, కొంతమంది రైతులు జీవాలకు మేతగా వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సారెస్పీకు ద్వారా నీళ్లు విడుదల చేయకపోతే రహదారులను దిగ్భందం చేయనున్నట్లు, అవసరమైతే అసెంబ్లీ ముట్టడి చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం ఎస్సారెస్పీ కాల్వ నీళ్లు విడుదల చేయాలని రైతులతో కలిసి నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శీలం సైదులు, కార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి, జిల్లా నాయకులు ఏలూరు వెంకటేశ్వరరావు, మిక్కిలినేని సతీశ్, నూకల యుగంధర్ రెడ్డి, నూకల శ్రీనివాస్ రెడ్డి, గుండాల గంగులు, పల్స మన్సూరు, భూక్య గాంధీనాయక్, బానోతు బాబు నాయక్, దేవుల నాయక్, ముత్తయ్య, వెంకటేశ్వర్లు, కారింగుల శ్రీనివాస్ గౌడ్, మూడు కృష్ణ, పిట్టల నాగేశ్ పాల్గొన్నారు.