సూర్యాపేట, మే 30 : తెలంగాణ రైతాంగం పాలిట ఉరితాడుగా మారనున్న మూడవ డిస్కం ఏర్పాటును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఈ విషయంలో రైతుల పక్షాన పార్టీ ముందుండి పోరాడుతుందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ చేసిన రైతు అనుకూల కార్యక్రమాలు రైతుబంధు, ఉచిత విద్యుత్, ధాన్యానికి ధర ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తుందన్నారు. మూడవ డిస్కం తీసుకొస్తామని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టక తప్పదనడం రైతులను నిలువున మోసం చేసే ప్రయత్నమే అన్నారు. రైతులు కరెంట్ ఎంత వాడుతున్నారో తెలియడం లేదని కాబట్టి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడం తప్పదు కాబట్టి మూడవ డిస్కం పెడతామనడం సిగ్గుచేటు అన్నారు. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ 24 గంటలు రైతుకు ఉచిత కరెంట్ అందజేశారని రైతుల మోటార్లకు మీటర్లు పెడితే నాటి బిజెపి ప్రభుత్వం 30 వేల కోట్ల సబ్సిడీ ఇస్తామన్న లొంగలేదన్నారు. తన మెడ మీద తలకాయ ఉన్నంత వరకు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని తెలంగాణలో కేసీఆర్ తిరస్కరించాడన్నారు.
మళ్లీ మీరు తెలంగాణలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తూ 10 నుంచి 15 వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని అదానీ, అంబానీ లకు అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తుందన్నారు. మూడవ డిస్కం ఏర్పాటును బీఆర్ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని, రైతుల పక్షాన ముందుండి పోరాడుతుందన్నారు. నిన్న జరిగిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని 3 గంటలు ఉంటే చాలని మాట్లాడడం రైతులను ఆగ్రహానికి గురి చేస్తుందన్నారు. ఇప్పటికే ఉన్న రెండు డిస్కంలకు రూ.54 వేల కోట్ల రుణం ఉందని అవే కష్ట కష్టంగా నడుస్తున్నాయని అది చాలదు అన్నట్లు కొత్త డిస్కం ఏర్పాటుతో ఉచిత విద్యుత్ ను రద్దు చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయానికి వస్తే 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి వారంలో కొనుగోలు కేంద్రాలను మూసివేస్తామని అంటున్నారని అన్నారు.
2023లో కేసీఆర్ 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇంటికి వెళ్లి డబ్బులు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు, సివిల్ సప్లయ్ అధికారుల అవినీతి కారణంగా మిల్లర్లు కొనలేక తాలు పేరు చెబుతూ బస్తాల సాకు చెబుతూ రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లాల వద్దనే రైతులు పడిగాపులు కాస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఓటరు సవరణలో కొత్త ఓటర్లను చేర్చడంతో పాటు దొంగ ఓట్ల ఏరివేతలో ముందుండాలని, ఓటరు జాబితాలో తప్పులు లేకుండా నిజమైన ఓటర్లు ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకుడు ఉప్పల ఆనంద్ పాల్గొన్నారు.