సాధారణంగా శరీరంలో కొవ్వు తగ్గడం అన్నది మంచి విషయంగా పరిగణిస్తాం. అయితే ఏ కారణాల వల్లయినా అందులోని మంచి కొవ్వులు తగ్గిపోవడం అన్నది మధుమేహానికి దారి తీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల మిషిగాన్ యూనివర్సిటీలో చేసిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. సహజంగా కొవ్వులు శక్తిని నిల్వ చేసి, జీవక్రియల నియంత్రణ, హార్మోన్ల విడుదలకు సాయపడతాయి. అయితే ఏదైనా వ్యాధి లేదా శరీరం మీద పడే విపరీతమైన ఒత్తిడి కారణంగా కొవ్వు కణాలు దెబ్బతింటే తర్వాత అవి వాపునకు గురై మెల్లగా మాయమైపోతాయి. తద్వారా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడి షుగర్ వ్యాధికి కారణం అవుతాయని ఇటీవలి పరిశోధన తేటతెల్లం చేసింది.
శరీరంలో కొవ్వుల్ని ప్రభావితం చేసే ఫెమీలియల్ పార్షియల్ లిపోడిస్ట్రోఫీ టైప్-2లాంటి జబ్బులతో పాటు కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఇలా కొవ్వు కణజాలాన్ని బాగా దెబ్బతీస్తాయి. దాని వల్ల ఈ రోగులు వివిధ వ్యాధుల బారిన పడుతున్నట్టు శాస్త్రవేత్తలు గమనించారు. ఇన్ని రోజులు అధిక కొవ్వుల వల్లే మధుమేహం, గుండె జబ్బులు వస్తున్నాయని భావించినా, మంచి కొవ్వు కణజాలం దెబ్బతిన్నా షుగర్, ఫ్యాటీ లివర్ సహా జీవక్రియకు సంబంధించిన వివిధ వ్యాధులు చుట్టు ముడతాయనీ ఈ నివేదిక చెబుతున్నది. కాబట్టి మంచి కొవ్వుల్ని కాపాడుకోవడమూ మనకు ముఖ్యమే అన్నమాట!