సూర్యాపేట, (నమస్తే తెలంగాణ)/తిరుమలగిరి, కోదాడ, మే 19 : యూట్యూబ్ చానళ్లు పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తికి ధీటైన జవాబిచ్చే సమయం వచ్చిందని, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించే ఏనుగుల రాకేశ్‌రెడ్డికి పట్టభద్రులు పట్టం కట్టాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఉద్యమ కారుడు, విద్యావంతుడు, మర్యాదస్తుడు రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా ఆదివారం తిరుమలగిరి, సూర్యాపేట, కోదాడలో నిర్వహించిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి లాగు తడిపించే నాయకుడు, ప్రధాని మోదీ మోసాలను పశ్నించే వాడు ప్రస్తుతం కావాలన్నారు. పదేండ్లలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దేనన్నారు. 2 లక్షల ఉద్యోగాలిస్తాని నమ్మించి మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి పట్టభద్రులు కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. కనీసం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వాటిని కూడా కొనసాగించలేని దుస్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉందన్న విషయాన్ని నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులుచ ప్రైవేట్ ఉద్యోగులు గమనించాలని కోరారు.
20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 40 కోట్ల మందికి ఆకలితో అలమటించేలా మోదీ ప్రభుత్వం చేసిందన్నారు. గుజరాత్, బిహర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో ఎందుకు ప్రజలు ఆకలితో పస్తులు ఉంటున్నారని ప్రశ్నించారు. 75 సంవత్సరాలు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు పాలించి ఆకలి చావుల కోసమేనా విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎక్కడైనా ప్రజలు ఆకలితో ఉన్నారా, రెండు పూటలు కడుపునిండా అన్నం పెట్టిన వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ, నాయకులు రాంచందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.