భువనగిరి అర్బన్, మే 14 : జిల్లా కేంద్రంలోని భువనగిరి బస్టాండ్‌కు నిత్యం సుమారు ముప్పై వేల నుంచి నలభై వేల మంది ప్రయాణికులు వచ్చిపోతుంటారు. అలాంటి బస్‌స్టేషన్‌లో రోజు రోజుకు దొంగల బెడద పెరిగిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించడంతో బస్సుల్లో మహిళల రద్దీ ఎకువ కావడంతో దొంగలు తమ పనిని సులువుగా చేసుకుంటూ పోతున్నారు. గత మూడు నెలల్లోనే ముప్పైకి పైగా దొంగతనాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో ప్రయాణికుల పర్సులు, బ్యాగులు, సెల్ఫోన్లు అపహరణకు గురవుతున్నా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే వెళ్తున్నారు. ప్రధానంగా పోలీస్‌స్టేషన్ బస్టాండ్‌కు దూరంగా ఉండడం, ఫిర్యాదు చేసినా తమ వస్తువు దొరుకుతుందో లేదోనన్న అపనమ్మకం, బస్‌స్టేషన్‌లో పోలీస్ అవుట్ పోస్ట్ లేకపోవడంతో బాధుతులు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారు.
బస్టాండ్‌కు అద్దెల రూపంలో ప్రతి నెలా రూ.10 లక్షల ఆదాయం ఉన్నా.. ఆర్టీసీ అధికారులు కనీసం హోం గార్డులను నియమించుకునే స్థితిలో లేరంటే ప్రయాణికులపై వారి నిర్లక్ష్యాన్ని తెలుపుతుంది. బస్టాండ్‌లో కేవలం ఒకే ఒక సీసీ కెమెరా ఉండడం, అది కూడా పూర్తిస్థాయిలో పని చేయకపోవడం గమనార్హం. ఇప్పటికైనా బస్టాండ్‌లో దొంగతనాలు జరుగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను పెంచడంతోపాటు పోలీస్ అవుట్‌పోస్టును ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.