సూర్యాపేట, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నోటికొచ్చి న ప్రకటనలు చేస్తూ విద్యా శాఖను నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కూళ్లు అన్నారు.. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు అన్నారు.. ప్రీ ప్రైమరీ స్కూల్స్.. ఇలా అనేక ప్రకటనలు చేయడం, అనంతరం వెనుకడుగు వేయడం విద్యాశాఖ కు పరిపాటిగా మారింది. స్వయానా ముఖ్యమంత్రి చేతిలో ఉన్న విద్యాశాఖ దుస్థితిపై ఆ శాఖ అధికారులు, ఉపాధ్యాయలోకంతో పా టు మేధావులు సెటైర్లు వేస్తున్నారు.
కార్పొరేట్‌ను తలదన్నే ప్రకటనలు..
25 ఎకరాల్లో అన్ని వసతులతో కార్పొరేట్ కళాశాలలను తలదన్నేలా నియోజకవర్గానికో యంగ్ ఇండియా స్కూ ల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ప్రకటనలు చేశారు. కానీ ఆచరణలో చూస్తే ఎక్కడో ఒక చోట యంగ్ ఇండియా స్కూల్ భవన నిర్మా ణ పనులకు శంకుస్థాపన చేశారే తప్ప నిర్మా ణ పనులు చురుగ్గా సాగడం లేదు. అవి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలియదు. అలాగే 25 ఎకరాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అన్నారు. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ హయాం నుంచి విజయవంతంగా నడుస్తున్న మోడల్ స్కూళ్లు, జడ్పీలను ఎం పిక చేశారు.
కానీ వారంలో పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి విధి విధానాలు ప్రకటించలేదు. అడ్మిషన్ల ప్రక్రియ ఎలాగో అధికారులకు కూడా తెలియడం లేదు. అలాగే 6వ తరగతి నుంచి 10 వరకు ఉన్న ఇంటర్నల్ మార్కులను రద్దు చేస్తున్నామని ప్రకటించారు… ఇది అనాలోచిత నిర్ణయం అనుకున్నారో ఏమో కానీ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. దీంతో ఆయా తరగతులకు 80 మార్కులు ఉంటాయా లేక వంద మార్కులా..అనేది మూడు నెలల పాటు తెలియక గందరగోళంగా మారింది.
ఈ ఏడాది సూర్యాపేట జిల్లాలో 90 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ ప్రవేశపెడుతూ జాబితా విడుదల చేశారు. కానీ ఇప్ప టి వరకు ఎలాంటి మెటీరియల్ రాలేదు. వీటితో పాటు ఉపాధ్యాయుల పరిస్థితి కూడా అంతంతే మాత్రంగానే ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంటర్ బోర్డు ఉండదు… రద్దు చేస్తున్నామని ప్రకటనలు వచ్చాయి. ఏమైం దో ఏమో.. మళ్లీ ఇంటర్ అడ్మిషన్లు యధావిధిగా తీసుకుంటున్నారు. పాఠశాలల్లోనే 11, 12 తరగతులు ఉంటాయని, వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలు ఉండవు.. ఇవే చివరివి అంటున్నారు.. కానీ ఎలాంటి విధి విధానాలు వస్తాయో చివరకు ఏమవుతుందో వేచి చూడాల్సి ఉంది. బదిలీలపై వచ్చిన ఉద్యోగులకు ప్రత్యేక బదిలీలు లేదా డిప్యూటేషన్లు ఇస్తామని ప్రకటనలు చేశారు. ఈ మేరకు వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారే కానీ దీనిపై అతీగతీ లేదు.
అడ్మిషన్లు సున్నా..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్ల పాటు ప్రతి సంవత్సరం జయశంకర్ బడి బాట పేరిట ప్రతి యేటా జూన్ 2 నుంచి 15 వరకు అడ్మిషన్లు ఇచ్చేవారు. కానీ ఈ ఏడాది అడ్మిషన్లు అరకొరగా కూడా రాలేదని తెలిసింది. ప్రభుత్వం ఏదో చేసినట్లు వంద రోజు ల కార్యక్రమం చేపట్టగా అందులోనే విద్యాశాఖ కూడా ఉండటంతో కేవలం ఫొటోలకు ఫోజులిచ్చి మమ అనిపించారే తప్ప అడ్మిషన్ల కోసం పట్టుబట్టలేదు. సాధారణంగా పాఠశాలల ప్రారంభానికి కొద్ది రోజుల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం ఆలోచన చేస్తుంటారు. ఆ సమయంలో కాకుండా ముందుగానే వందరోజుల కార్యక్రమం చేపట్టడంతో బడిబాట కార్యక్రమం విఫలమైందని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి విద్యా శాఖను సమర్థులైన వారికి అప్పగించడమో లేక తానే సరైన నిర్ణయం తీసుకొని విద్యాశాఖను గాడిన పెట్టకుంటే రానున్న రోజుల్లో విద్యావ్యవస్థ మరింత భ్రష్టుపట్టే అవకాశం ఉందనే విమర్శలు వస్తున్నాయి.
రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని ప్రగల్భాలు..
భావి పౌరులను తీర్చిదిద్దే విద్యా శాఖను వేరే ఎవరి చేతిలోనైనా పెడితే సరిగ్గా చూసుకోరు… నా వద్దే ఉంచుకొని ప్రపంచంలోనే తెలంగాణ విద్యా వ్యవస్థను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని ప్రగల్భాలు పలికినన ముఖ్యమంత్రి మాటలు ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. విద్యాశాఖ పరిస్థితిని చూస్తూ ఏనాడూ ఇంతటి దారుణమైన పరిస్థితి లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు గురుకులాలు ఒకటీ అర కూడా లేవని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నేతృత్వంలో వేల కోట్లు వెచ్చించి పాఠశాల నుంచి డిగ్రీ వరకు మండలానికి ఒకటి మంజూరు చేస్తూ విద్యాశాఖను బలోపేతం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం చెప్పిన మాటలు నిజమని నమ్మి ఎదురు చూసిన జనం.. ప్రధానంగా విద్యాశాఖ పనితీరును చూసి నెవ్వెరపోతున్నారు.