ఆచరణలో అడుగు ముందుకు పడని కాంగ్రెస్ హామీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు రైతు భరోసాపై అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామంటున్న ప్రభుత్వం కౌలు రైతులపై స్పష్టత ఇవ్వకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. సూర్యాపేట జిల్లాలో దాదాపు 67వేల మంది కౌలు రైతులు 2.17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా, వారంతా సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
– సూర్యాపేట, జనవరి 2 (నమస్తే తెలంగాణ)
ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ జిల్లా రైతాంగం పంటల సాగుకు పడిన వెతలు అన్నీ ఇన్నీ కావు. సాగు నీటి వసతి లేక, ప్రాజెక్టులు ఉన్నచోటా ఆయకట్టుకు సరైన వాటా దక్కక కష్టాలమయంగా ఉండేది. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలు బీడుగా దర్శనమిచ్చేవి. సాగునీటి వసతి లేక రైతు కుటుంబాలు బతుకుదెరువు కోసం వలస వెళ్లేవి. కౌలు రైతులు, వ్యవసాయ కూలీల పరిస్థితి మరింత దారుణం. సాగునీటి వసతి లేని చోట భూగర్భంలో నీటి జాడ కూడా కరువయ్యేది. దాంతో కరువు చాయలు కొట్టొచ్చినట్లు కనిపించేవి. కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాల్లో నిక్కచ్చి వాటాను ఎడమ కాల్వ ఆయకట్టుకు అందించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి మూసీ ప్రాజెక్టును ఆధునీకరించి కుడి, ఎడమ కాల్వల కింద ఏటా రెండు పంటలకు నీళ్లిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లోని బీడు భూములను తడిపారు. 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించారు. రైతులకు పంట పెట్టుబడి కోసం రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టి ఏటా రెండు పంటలకు ఎకరాకు రూ.5వేల చొప్పున అందించారు. ఆరేండ్లు.. పన్నెండు సీజన్లలో జిల్లా రైతాంగానికి రూ.3,200 కోట్లు పంట పెట్టుబడి సాయం అందించారు. దాంతో వ్యవసాయ పెద్దఎత్తున వృద్ధిలోకి వచ్చింది.
పడావు పడ్డ భూములు పచ్చదనం పరుచుకున్నాయి. వలస బాట పట్టిన రైతులు సొంత ఊళ్లకు వచ్చి వ్యవసాయం చేశారు. వేలాది మంది రైతులు భూములను కౌలుకు తీసుకుని సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. దాంతో వ్యవసాయ కూలీలకూ ఉపాధి దొరికింది. కాగా, గత ఎన్నికల్లో అడ్డగోలు హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ రైతులను అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేస్తున్నది.
పంట రుణమాఫీ అందరికీ అందించకపోగా, రైతుబంధును రైతు భరోసాగా మార్చి ఇస్తామన్న సాయం ఊసే లేదు. ఎన్నికల ముందు యాసంగికి సంబంధించిన రైతుబంధును నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంకుల్లో వేసినప్పటికీ ఎన్నికల కోడ్‌తో నిలిచిపోగా, అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అవే డబ్బులను రైతుల అక్కౌంట్లలో జమ చేసింది. ఎకరాకు రూ.7,500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ సర్కారు ఇచ్చినట్టు రూ.5వేలను మాత్రమే అందించింది.
ఆ తర్వాత సీజన్‌కు రైతు భరోసా ఇచ్చిందే లేదు. తాజాగా మంత్రివర్గ ఉప సంఘం సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ప్రకటించగా, అందులో కౌలు రైతుల ప్రస్తావన లేకపోవడం వారి ఆందోళనకు గురి చేస్తున్నది. జిల్లాలో 6.12 లక్షల ఎకరాల సాగులో ఉండగా 2.71 లక్షల మంది రైతులు ఉన్నారు. అందులో సుమారు దాదాపు 67వేల మంది రైతులు 2.17 లక్షల ఎకరాలను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా. వారంతా తమకు రైతు భరోసా ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో అప్పుడే కౌలురైతులకు భరోసా అందుతుందని చెప్తున్నారు.
నేను నాలుగేండ్ల నుంచి మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. కౌలు రైతులకు ఎకరాకు సంవత్సరానికి 15వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టింది. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయినా నేటి వరకు అమలు చేయలేదు. ఇప్పుడు సంక్రాంతి తర్వా ఇస్తామంటున్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు కౌలు రైతులను గుర్తించి రైతు భరోసా అందించాలి.
-మామిడి వెంకటేశ్వర్లు, కౌలురైతు, అనంతారం, పెన్‌పహాడ్