జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు ప్రొబేషనరీ తరహాలో విధులు నిర్వహిస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మండల కేంద్రాల్లో స్వీట్లు పంచుకొని సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,640 మంది పంచాయతీ కార్యదర్శులకు ఊరట కలిగింది. ఇక నుంచి వారికి సీనియర్ పంచాయతీ కార్యదర్శుల మాదిరిగా అన్ని బెనిఫిట్స్ వర్తించనున్నాయి. త్వరలో వీరికి పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆధ్వర్యంలో విధివిధానాలు రూపొందించనున్నారు.
నల్లగొండ, మే 23 : జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు ప్రొహిబేషనరీ తరహాలో విధులు నిర్వహిస్తున్న వారిని క్రమబద్ధీకరణ చేయనున్నట్లు ప్రకటించింది. దాంతో జూనియర్ పంచాయితీ కార్యదర్శులు మంగళవారం ఆయా మ ండలాల్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. మిఠాయి పంచి పెట్టారు. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి పల్లె ప్రగతి నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమం నిర్వహణకు ముందు ప్రతి పల్లెల్లో పంచాయతీ కార్యదర్శులు ఉండాలనే ఆలోచనతో 2019 ఏప్రిల్ 12న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించింది. అప్పుడు వారికి రూ.15 వేల వేతనంతో మూడండ్లే ప్రొహిబేషనరీ పీరియడ్‌ను పెట్టింది. ఆ తర్వాత 2022 ఏప్రిల్ 12న మరో ఏడాది ప్రొహిబేషనరీ కాలం పెంచుతూ వేతనం మాత్రం రూ.29 వేలు చేసింది. ఆ గడువు ఈ ఏడాది ఏప్రిల్ 12తో పూర్తి కావడంతో ప్రభుత్వం ఇచ్చిన మాటకు అనుగుణంగా వారిని క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది. దాంతో నల్లగొండ జిల్లాలో 648, యాదాద్రి భువనగిరి జిల్లాలో 656, సూర్యాపేట జిల్లాలో 336 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్ కానున్నారు. వీరితో పాటు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న మరో 82 మంది కార్యదర్శులు ఉండగా వీరిని సైతం త్వరలో రెగ్యులర్ చేసే అవకాశం ఉన్నది.
ఇక ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే బెనిఫిట్స్..
ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తున్న నేపథ్యంలో వీరికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే బెనిఫిట్స్ అందనున్నాయి. ప్రస్తుతం వీరికి నెలకు రూ.29వేల వేతనం అందుతుండగా అందులో సుమారు 19 వేలు బేసిక్ ఉంటుంది. ఈ బేసిక్‌లో ఇక నుంచి హెచ్ఆర్ఏ, డీఏ లాంటి అలవెన్సులతో పాటు ఈహెచ్ఎస్, కారుణ్యం లాంటి సౌకర్యం ఉండనుంది. ఇక వీరి వేతనంలో పీఎఫ్ అమలు కానుంది . అన్ని అలవెన్సులు కలుపుకోని రూ. 3 నుంచి 4 వేల దాకా జీతం పెరిగే అవకాశం ఉంది.