నీలగిరి, జనవరి 12 : నల్లగొండ పట్టణ శివారులోని నిధి పైపుల కంపెనీలో చోరీకి పాల్పడ్డ దొంగల ముఠాలోని ముగ్గురు వ్యక్తులు హమీద్ హుస్సేన్, జహాంగీర్ ఆలం, షఫిక్ ఆలంను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు మహమ్మద్ ఇస్లాం, కమల్ హుస్సేన్, ఖైసర్, నూర్ ఖాసిం పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుండి ఇత్తడి సైజర్లు (40), బ్యాటరీలు (35), యూపీఎస్ బంచ్ కేబుల్ వైర్, 50 కేజీల ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్, ప్యాసింజర్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ సొత్తు విలువ రూ.60 లక్షలుగా సమాచారం. నల్లగొండ అడిషన్ ఎస్పీ జి.రమేశ్ సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. నిందితులంతా మయన్మార్ నుండి భారత్కు శరణార్థులుగా వచ్చి హైదరాబాద్లోని బాలాపూర్, రాయల్ కాలనీలో నివసిస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి పట్టణాల శివారులోని కంపెనీలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో ఈ నెల 7న నల్లగొండ పట్టణ పరిధి ఆర్జాలబావి గ్రామ శివారులో గల నిధి పైపుల కంపెనీలో దొంగతనానికి పాల్పడ్డారు. చోరీ చేసిన సొత్తును ఆటోలో తీసుకువెళ్లలేక పక్కనే ఉన్న చెట్ల పొదల్లో దాచి ఆటోలోనే బాలాపూర్కి వెళ్లారు. తిరిగి 12వ తేదీన ఆటోలో వచ్చి అపహరించిన సొత్తను హైదరాబాద్కు తీసుకువెళ్తుండగా బుద్దారం రోడ్, చర్లపల్లి గ్రామ శివారులో నల్లగొండ టూ టౌన్ సీఐ రాఘవరావు, ఎస్ఐ సైదాబాబు తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. పోలీసులు వీరిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేశారు.