మోత్కూరు, ఏప్రిల్ 23 : రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న గాలివాన రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నది. బలమైన గాలులతో పాటు వడగండ్లు పడుతుండడంతో చేతి కొచ్చిన పంట దెబ్బతింటున్నది. కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దవుతున్నది. మామిడి కాయలు రాలుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం మోత్కూరు మండలంలోని దాచారం, పాటిమట్ల, అనాజిపురం, అడ్డగూడూరు మండలంలోని రాపాక(డీ), కంచనపల్లి, అడ్డగూడూరు, మంగమ్మగూడెం, అజీంపేట, వెల్దేవి గ్రామాల్లో రాళ్ల వాన పడింది. దాంతో కోతకొచ్చిన వరిపంట నేలవాలింది. మామిడి కాయలు రాలి పోయాయి.
అడ్డగూడూరు : మండల వ్యాప్తంగా శనివారం రాత్రి, ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. దాంతో కల్లాల్లో ఉన్న వరి ధాన్యం తడిసినట్లు రైతులు తెలిపారు. పలు గ్రామాల్లో వడగండ్ల వర్షంతో వరి చేను నేలవాలింది.
మోటకొండూర్ : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దాంతో వరి ధాన్యం, మామిడి కాయలు నేలరాలాయి. ఐకేపీ కేంద్రాల్లో పోసిన ధాన్యంపై కప్పిన పట్టాలు గాలికి ఎగిరిపోయి ధాన్యం తడిసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎగిరిపోయిన ఇంటి పైకప్పులు
భూదాన్ పోచంపల్లి : మున్సిపాలిటీ కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చింతబావిలో బానోతు హన్మయ్యకు చెందిన ఇంటి రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
మేళ్లచెర్వు : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దాంతో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. కల్లాల్లోని ధాన్యంపై రైతులు పట్టాలు కప్పుకున్నప్పటికీ గాలి ధాటికి పట్టాలు లేచిపోయి ధాన్యం తడిసినట్లు రైతులు తెలిపారు.
చివ్వెంల : మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. పలు గ్రామాల్లో కోతకొచ్చిన వరి చేలు నేలకొరిగాయి.
కోదాడ రూరల్ : మండల వ్యాప్తంగా ఈదురు గాలులు, వడగండ్ల వాన కురిసింది. పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. కల్లాలోని ధాన్యం తడిసింది. మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.
ఐకేపీ కేంద్రాల్లో తడిసిన ధాన్యం
తుంగతుర్తి : మండలంలోని దేవునిగుట్టతండా, వెలుగుపల్లి గ్రామాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దాంతో ఐకేపీ కేంద్రాల వద్ద రైతులు పోసిన తడిసింది. మరికొంత ధాన్యం వరద ధాటికి కొట్టుకు పోయినట్లు రైతులు తెలిపారు. మామిడి, నిమ్మ తోటలకు కూడా నష్టం వాటిల్లింది.
నేల రాలిన మామిడి
అర్వపల్లి : మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కోత దశలో ఉన్న వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. వరిచేలు నేలవాలగా వడ్లు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులపై కప్పిన పట్టాలు వడగండ్ల ధాటికి చిరిగిపోవడంతో ధాన్యం తడిసి వరదకు కొట్టుకుపోయింది. అడివెంల గ్రామానికి చెదిన నోముల లింగయ్య పాడి గేదెపై చెట్టు కూలడంతో మృతి చెందింది. ఈదురు గాలులకు 80కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సుమారు 15ఇండ్లు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.
పరిశీలించిన అధికారులు
తాసీల్దార్ యాదగిరిరెడ్డి దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు. మండల వ్యాప్తంగా సుమారు 6వేల ఎకరాల్లో వరి, 278 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బ తిన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉదయం నుంచి వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో గ్రామాల్లో పర్యటించి పంట నష్ట వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా తాసీల్దార్ యాదగిరిరెడ్డి మాట్లాడుతూ రైతులు ఆధైర్యపడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
పిడుగుపాటుకు మహిళ మృతి
అర్వపల్లి మండలంలోని నాణ్యతండా ఆవాస గ్రామం పూర్యతండాలో పిడుగు పాటుకు కేలోతు రంగమ్మ (45) మృతి చెందింది. బొల్లంపల్లిలో బర్రెకూడా మృతి చెందింది.
నాగారం : మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన వర్షానికి వరి పంట దెబ్బతిన్నది. వరి, మామిడి, నిమ్మ తోటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. మండల వ్యవసాయ అధికారి పెందొండ గణేశ్, హార్ట్టికల్చర్ అధికారి శ్రవంతి, ఏఈఓలు పంటనష్టాన్ని పరిశీలించి నమోదు చేసుకున్నారు. పలు గ్రామాల్లో ఇండ్లు పైకప్పులు లేచిపోయాయి.
హుజూర్నగర్ : పట్టణంలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టిచింది. పట్టణంలో 5వ వార్డులో తాటి చెట్టు విరిగి విద్యుత్ తీగల పైన పడటంతో తీగలు తెగిపోయాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కోర్టు వద్ద గాలికీ భారీ చెట్టు కూలిపోయి కరెంటు స్తంభాలపైన పడటంతో మూడు స్తంభాలు విరిగి పోయాయి. మండలంలోని వేపలసింగారంలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం విరిగిపడింది.