శాలిగౌరారం జూలై 1ః నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది..ఇల్లు కట్టుకో అని చెప్పడంతో ఉన్న ఇంటిని కూలగొట్టుకోని రోడ్డున పడ్డ ఓ బాధితుని వైనం శాలిగౌరారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు రాజు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన బట్ట రాజుకు చిన్న రేకుల ఇల్లు ఉంది. భార్య, ఇద్దరు కూతుర్లతో నివాసం ఉంటూ కూలినాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలోని కొంత మంది నాయకులు 20 రోజుల క్రితం “నీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని” చెప్పినట్లు బాధితుడు తెలిపాడు.
ఇల్లు వచ్చిందనే ఆనందంతో ఉన్న రేకుల ఇంటిని కూలగొట్టి తట్టాబుట్ట సర్దుకోని సమీపంలోని హరిజన కమ్యూనిటీ హాలులో కుటుంబంతో తలదాచుకుంటున్నాడు. కొత్త ఇల్లు కట్టుకుందామని సిద్ధమవుతున్న తరుణంలో నీకు ఇల్లు మంజూరు కాలేదని చెప్పడంతో ఒక్కసారిగా అవాక్కైనట్లు బాధితుడు పేర్కొన్నారు. మొదటగా తన పేరును జాబితాలో చేర్చి, ఇప్పుడు తొలగించినట్లు రాజు వాపోయాడు. నాయకులు చెప్పిన మాటలు విని ఉన్న ఇల్లును కూలగొట్టుకున్నాని ఇప్పుడు తన పరిస్థితి ఏమిటో తనకే అర్థం కాట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు తన కుటుంబానికి న్యాయం చేసి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని రాజు వేడుకుంటున్నాడు.