సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ‘నువ్వే పత్రికల్లో నాపై వార్తలు రాయిస్తున్నావం’టూ ఒక అధికారి అంటే నువ్వు మమ్ములను అణిచివేస్తున్నావంటూ మరొక అధికారి వాగ్వాదం.. సీఈఐజీ పెట్టిన ఉద్యోగుల సమావేశంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పెద్దగా అరుచుకుంటూ ఆఫీసు అంతా అల్లకల్లోలం చేశారు. పత్రికల్లో వార్తలు వస్తే వాటికి తగిన సమాధానం ఇవ్వడమో లేక అందులో వచ్చిన వార్తల్లో నిజానిజాలు నిర్ధారించి తమ విభాగాన్ని సరిదిద్దుకోవడమో చేయాల్సింది పోయి కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులపై అనుమానాస్పదంగా ఉంటున్నారంటూ ఉద్యోగులంతా తిరుగుబాటు చేసినట్లు సమాచారం.
సమావేశంలో సీఈఐజీకి ఇద్దరు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్లకు మధ్య జరిగిన గొడవ కార్యాలయంతో పాటు విద్యుత్‌శాఖలో చర్చనీయాంశమైంది. అసలు తమకు డిప్యూటీ సీఈఐజీ పదవులు రాకుండా కావాలనే సీఈఐజీ అడ్డుకున్నారంటూ, దీనిపై ఎనర్జీ సెక్రటరీకి తాము వివరణ ఇచ్చినా కావాలనే చీఫ్ ఇన్స్పెక్టర్ అక్రమంగా తన బాధ్యతలతో రెండు డిప్యూటీలను దగ్గర పెట్టుకుని ఎందుకు నడుపుతున్నారంటూ మీటింగ్‌లోనే నిలదీశారు. తాము కార్యాలయానికి సంబంధించినంత వరకు ఏ వ్యవహారం బయటకు రాకుండా కాపాడుతామని, ఉన్నతాధికారి తమను అనుమానించడంతో చాలా బాధపడుతున్నామని మీటింగ్‌లో ఉద్యోగులంతా వాపోయారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ తమపై వేసిన నిందలు నిరూపించకపోతే ఉన్నతాధికారి రాజీనామా చేయాలని, ఆధారాలు చూపిస్తే తాము రాజీనామాకైనా సిద్ధమేనంటూ చెప్పారు. సీఈఐజీకి సంబంధిత శాఖామంత్రితో పాటు ఎనర్జీ సెక్రటరీతో సత్సంబంధాలు ఉన్నాయంటూ ఆయన చెప్పుకోవడంతో ఉద్యోగులంతా ఆయన ఏం చేసినా గత ఆరునెలలుగా పట్టించుకోలేదని, ఇప్పుడు ఏకంగా తమనే టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తూ తమకు రావాల్సిన ప్రమోషన్లను, ప్రయోజనాలకు గండికొడుతుంటే ఎలా ఊరుకుంటామంటూ ప్రశ్నించారు.
అసలేం జరుగుతోంది..!
చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ టు గవర్నమెంట్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారింది. కార్యాలయంలో జరిగిన గొడవ ఎనర్జీ డిపార్ట్మెంట్లో చర్చకు దారితీసింది. గత ఆగస్ట్‌లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కార్యాలయ ఉద్యోగులతో సఖ్యంగా ఉండకపోగా, వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక సాంకేతిక ఇంజినీర్‌తో కలిసి తమను టార్గెట్ చేస్తున్నారంటూ ఇంజినీర్లంతా గొడవ చేశారు. డిప్యూటీ సీఈఐజీ డిజిటల్ సంతకాలను ఫోర్జరీ చేసిన వ్యవహారంలో కూడా సీఈఐజీ వచ్చిన తర్వాత విషయం వెలుగులోకి రాగానే ఇద్దరు కాంట్రాక్టర్లను పిలిచి కేసు పెట్టి ఆ తర్వాత వ్యవహారాన్ని ముగించేద్దామనుకున్నారని, అయితే ‘నమస్తే’ మళ్లీ తెరపైకి తేవడంతో ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లను పిలిచే పనిలో పడ్డారని తెలిసింది.
ఒకవైపు ఉద్యోగులతో గొడవ, మరోవైపు సీఈఐజీ కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై నిగ్గు తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఎనర్జీ సెక్రటరీ తనను నివేదిక కోరిన నేపథ్యంలో ఇన్స్పెక్టర్లకు సంబంధించిన కేసులు, వారిపై ఉన్న ఆరోపణలను తాను కచ్చితంగా పంపించాల్సి ఉంటుంది కాబట్టే పంపానని, ఇందులో తనకెలాంటి వ్యతిరేకత లేదని ఉద్యోగులకు నచ్చచెప్పేందుకు సీఈఐజీ ప్రయత్నించారు. కానీ కొందరు ఇంజినీర్లు మాత్రం ఉన్నతాధికారి తమపై కక్షసాధింపు చర్యలకు పూనుకున్నారంటూ సమావేశంలో బహిరంగంగానే విమర్శించడం ఆతర్వాత తాను చేసిన ఆరోపణల పట్ల ఉన్నతాధికారి సారీ చెప్పినట్లు సమాచారం.