సూర్యాపేట, ఆగస్టు 24 : జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రజల పాలిట శాపంగా మారాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల పేరుతో పట్టణంలోని ప్రతి వార్డులో ప్రతీ సందులో రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గోతులు తవ్వి మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేశారు. అనంతరం మ్యాన్‌హోళ్లను పూడ్చారే తప్ప గోతులను సరిగా పూడ్చకపోవడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
సూర్యాపేటలో అమృత్ 2.0 పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు గాను కేంద్ర ప్రభుత్వ వాటా 33 శాతం, రాష్ట్రం వాటాగా 67 శాతం కింద రూ. 316 కోట్లు కేటాయించి గత ప్రభుత్వంలో 40 కిలో మీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించారు. అయితే ఈ పనులు ప్రస్తుతం 290కిలో మీటర్ల మేర చేపట్టారు. 2018లో మొదలు పెట్టిన పనులు 2026 మార్చిలోపు పూర్తి చేయాల్సి ఉంది.
దీంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా పనులు చేపట్టడంతో ప్రట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో చేపడుతున్న అండర్ డ్రైనేజీ పనుల్లో భాగంగా ప్రతి రహదారిపై పెద్ద పెద్ద గుంతలు తీసి ఆరు అంగుళాల నుంచి రెండు అడుగుల వెడల్పుతో ఉన్న పైపులైన్లు వేస్తున్నారు. పట్టణంలో 10వేల మ్యాన్‌హోళ్లు నిర్మించాల్సి ఉంది. 30 నుంచి 40 అడుగుల మధ్య ఒక మ్యాన్‌హోల్ ఏర్పాటు చేసున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా, తవ్విన గుంతలను సరిగా పూడ్చకపోవడమే కాకుండా గుంతపై ఉన్న మట్టిని మరో చోటకు ట్రాక్టర్లలో తరలించడంతో కొంత కాలానికి మట్టి కుంగి పోయి భారీ గుంతలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్ కోసం రోడ్డు మధ్యలో తీసిన గోతుల్లో మట్టి కుంగి అక్కడక్కడా భారీ గుంలు ఏర్పడ్డాయి. వర్షాలు పడుతుండటంతో ఆ గుంతల్లో నీరు చేరడంతో పట్టణ ప్రజలు, వాహనదారులు అర చేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రయాణిస్తున్నారు.
పట్టణంలోని బాలాజీ నగర్, శ్రీరాంనగర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైపులైన్ వేసిన అనంతరం గోతులపై సిమెంట్ వేసి కొంత మేర సమస్యను పరిష్కరించాల్సి ఉండగా అధికారులు అటువంటి పనులేమీ చేయడంలేదు. తవ్విన గుంతలను మళ్లీ మళ్లీ తవ్వుతున్నారు. దీంతో జనం నడిచేందుకు కూడా వీలు లేకుండా అడుగుకో గుంత ఉంది.
ఇదిలా ఉండగా విద్యానగర్‌లో తీసిన గోతుల్లో కంకర పౌడర్ చల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే అదనపు కలెక్టర్ నివాసం ఉండే వీధిలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి తీసిన గోతుల్లో కంకర పౌడర్ చల్లి రోడ్డుపై గుంతలు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. కాగా తమ కాలనీలు ఏం పాపం చేశాయని, తమ వీధుల్లో తీసిన గోతుల్లో కూడా కంకరపౌడర్ చల్లి సమస్యను కొంత మేర నివారించాలని కోరుతున్నారు.
పట్టణంలోని బాలాజీ నగర్‌లోని ఓ వీధిలో జనం ఇంటికి రూ. 700ల చొప్పున వేసుకొని గోతులపై సిమెంట్ చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టణాభివృద్ధిల్లో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టడం హర్షించదగిన విషయమే అయినా ప్రజలకు ఇబ్బందులు రాకుండా పనులు చేపట్టాల్సి ఉండగా అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.
కొన్ని కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం తీసిన గుంతలను నెలల తరబడి పూడ్చడం లేదని మ్యాన్‌హోల్స్ ఏర్పాటు చేసి, పైపులైన్ నిర్మించి వెళుతున్నారని, మిగతా పనులు ఎవరు పూర్తి చేస్తారో అధికారులు తేల్చాల్సి ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై తగిన క్లారిటీ ఇవ్వాలని, అధికారులు స్పందించి త్వరితగతిన గుంతలు పూడ్చి ఇబ్బందులు పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
డ్రైనేజీ పనులపై క్లారిటీ ఇవ్వాలి..
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టడం మంచిదే. అయితే జనానికి ఇబ్బందులు రాకుండా చేయాల్సి ఉండగా అలా చేయడం లేదు. గుంతలు తీసి పైపువేసి అనామతుగా గుంతలు పూడ్చి వెళుతున్నారు. తరువాత అటు వైపు కూడా చూడటం లేదు. ప్రస్తుత వర్షాలకు మట్టి కుంగి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. బండిపై వెళ్లాలంటే భయమైతోంది.
-మెహందీకార్ సందీప్,విద్యానగర్, సూర్యాపేట
తవ్విన రోడ్లే మళ్లీ తవ్వుతున్నారు..
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో తవ్విన రోడ్లనే మళ్లీ తవ్వుతున్నారు. ఓ రోడ్డు తరువాత మరో రోడ్డును తవ్వకుండా అన్ని రోడ్లలో ఒకేసారి పనులు చేపట్టడంతో ఎటూపోయే దారి లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పైపులైన్ వేసిన అనంతరం గుంతలను సరిగా పూడ్చకపోవడంతో వాహనాలు దిగబడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
– ఈశ్వర్, వాహనదారుడు, సూర్యాపేట