తెలంగాణ ఉద్యమం అంటేనే ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలు గుర్తొస్తాయి. పోరాట స్ఫూర్తిని తలుచుకుంటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ల వరకు ఉద్యమంలో కాలుమోపి కదంతొక్కారు. తెలంగాణే శ్వాసగా, ఆశగా బతికారు. నాటి పార్టీల తీరు, సమైక్య నాయకుల వ్యవహారంతో వందల మంది ఆత్మబలిదానాలకు పాల్పడ్డారు. తమ ఆత్మార్పణంతో అయినా కాంగ్రెస్ చలించి తెలంగాణ ఇస్తుందని ప్రాణ త్యాగం చేశారు. ఇలా ఎంతో మంది అసువులు బాశారు. కానీ అమరుల త్యాగాలను కాంగ్రెస్ నేత చిదంబరం చిన్నదిగా కొట్టిపారేశారు. ఏదో మొక్కుబడిగా సారీతో సరిపెట్టారు. దీనిపై అమరుల కుటుంబ సభ్యులు భగ్గుమంటున్నారు. అమరులను అగౌరవపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తలుచుకుంటే ఉద్యమ స్ఫూర్తి ప్రజ్వరిల్లుతుంది. చిన్న పిల్లల నుంచి ముసలోళ్ల వరకు తెలంగాణ జెండా చేతబట్టి ఉద్యమంలో కదం తెలంగాణే శ్వాస, ఆశగా ముందుకు సాగారు. ఆనాటి కనికరం లేని కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా మంది ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు. అలాంటి అమరుల త్యాగాన్ని కాంగ్రెస్ నేత చిదంబరం చిన్నదిగా కొట్టిపారేశారు. ఏదో మొక్కుబడిగా సారీతో సరిపెట్టారు. దీనిపై అమరుల కుటుంబాలు భగ్గుమంటున్నాయి. అమరులను అగౌరవపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణ కోసం యావత్ తెలంగాణ ఒక్కటై ఉద్యమించింది. కాంగ్రెస్ పార్టీ సైతం తెలంగాణ ఏర్పాటు చేస్తామని 2004లో ప్రకటించింది. కానీ.. ఓట్లు దండుకున్నాక ఆ ముచ్చటే పట్టించుకోలేదు. 2009లో కేసీఆర్ దీక్ష తర్వాత నాటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అప్పుడే కాంగ్రెస్ ఇచ్చినట్లే ఇచ్చి.. పెండింగ్‌లో పెట్టింది. ఆంధ్రా నేతల లాబీయింగ్‌కు తలొగ్గి తెలంగాణకు మరోసారి అన్యాయం చేసింది. ఓ దశలో తెలంగాణ అవసరమా? అన్న విధంగా వ్యవహరించింది. సుమారు పదేండ్లపాటు తెలంగాణ ఏర్పాటు చేయకుండా నాన్చింది. రాష్ట్ర ఏర్పాటుకు వివిధ కమిటీలు, సంప్రదింపులు, సలహాలు, సూచనల పేరుతో కాలయాపన చేసింది.
నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సబ్బండ వర్గాలు ఏకమై ఉద్యమించాయి. ధూంధాం ఆటపాటలు, వంటావార్పులు, రోడ్లపై నిరసనలు, రాస్తారోకోలు, అడ్డగింతలు, సభలు, సమావేశాలు ఇలా ఒక్కటి కాదు.. ప్రపంచమే నివ్వెరపోయేలా తెలంగాణ పోరాట స్ఫూర్తి నిలిచింది. నాడు తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమకారులు ముందుకు నడిచారు. ఆత్మబలిదానాలు చూసి తెలంగాణవాదులంతా చలించిపోయారు. నాడు అమరుల అంతిమ యాత్రలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అంతిమ యాత్రలకు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారంటే అమరుల త్యాగాలను అర్థం చేసుకోవచ్చు.
హస్తం పార్టీ పదేండ్లపాటు కాలయాపన చేయడంతో కొందరు నిరుద్యోగులు, యువత, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ పదేండ్ల కాలంలో శ్రీకాంతాచారి, కొండేటి వేణుగోపాల్‌రెడ్డితోపాటు వందలాది మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. విద్యార్థులు, యువత ఉరి పెట్టుకుని బలిదానం చేశారు. వందలాది తల్లులకు కడుపుకోత మిగిల్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 67 మంది బలిదానాలకు కాంగ్రెస్ కారణమైంది. కానీ.. చిదంబరం మాత్రం ఉద్యమాలంటే కొందరు పోతారంటూ అమరులను అవమానించేలా మాట్లాడారు.
బలిదానాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదన్నారు. 2014 తరువాత తెలంగాణ ప్రాంతంలో వివిధ కారణాలతో చేసుకున్న ఆత్మహత్యలకు, నాటి ఉద్యమ సమయంలో జరిగిన బలిదానాలకు పోలిక పెడుతూ రాష్ట్రంలో చోటుచేసుకున్న బలవన్మరణాలకు కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహిస్తదా? అని నోటికొచ్చినట్లు మాట్లాడారు. దీనిపై అమరుల కుటుంబ సభ్యులు ఫైర్ అవుతున్నారు. పదేండ్ల తర్వాత అమరులు గుర్తుకొచ్చారా? అంటూ కడిగిపారేస్తున్నారు. ఇప్పుడు ఓట్ల కోసం కాకమ్మ కబుర్లు చెబుతున్నారని మండిపడుతున్నారు. కాగా, గతంలోనూ చిదంబరం తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపిన విషయం తెలిసిందే.
మాది దామరచర్ల మండలంలోని నర్సాపురం. మా నాన్న కోక్య నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో మండలంలో జరుగుతున్న అనేక ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నాడు. నాడు చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నామని చెప్పడంతో సంబురాలు జరుపుకొన్నాడు. కానీ.. ఆ ప్రకటన ఆగిపోవడంతో ఎంతో కుంగిపోయాడు. తిరిగి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. రోజూ టీవీ చూస్తూ ఆందోళన చెందేవాడు. తెలంగాణ ఉద్యమంపై నాటి సమైక్య నాయకులు, పాలకులు చేస్తున్న కుట్రలపై కుంగిపోయేవాడు. 2010 జనవరి 21న సమైక్య పాలకులు తెలంగాణపై చేస్తున్న కుట్రలను, ఉద్యమాన్ని బలహీన పర్చేందుకు చేస్తున్న కార్యక్రమాలను టీవీలో చూసి ఇక తెలంగాణ రాదని నిర్ణయించుకొని కోపంతో టీవీని పగులకొట్టాడు. బయటకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనాడు కాంగ్రెస్ పాలకులు డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి తెలంగాణ ఇస్తే మా నాన్న బతికి ఉండేవాడు. మా తండ్రి చావుకు వారే కారకులు. అప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు సారీ చెప్పడంతో చనిపోయిన మా నాన్న తిరిగి వస్తాడా? దీనికి వారే సమాధానం చెప్పాలి.
– మానోతు ప్రసాద్, నర్సాపురం, దామరచర్ల మండలం
మాది మధ్య తరగతి కుటుంబం. నా కొడుకు గిరిబాబు తెలివైనోడు. చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకునేటోడు. పది పాసైన తరువాత పాలిటెక్నిక్‌లో సీటు రావడంతో చదువుకుంటా అమ్మా అంటే వరంగల్‌కు పంపినం. అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నది. 60 ఏండ్లుగా తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ఉద్యోగాలు, నీళ్లు, నిధులు కావాలని చదువుకుంటున్న యువకులు రోడ్లమీదికి వచ్చి ఉద్యమాలు చేశారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించిండు.
తరువాత మూడు, నాలుగు రోజులకే మాట మార్చిండు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని ప్రకటించడంతోపాటు శ్రీకృష్ణ కమిటీ వేయడంతో హైదరాబాద్‌లో శ్రీకాంతాచారి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మ బలిదానం చేసుకున్నాడు. తెలంగాణ రాష్ర్టాన్ని ఇవ్వకుండా సీమాంధ్రోళ్లు అడ్డుపడుతున్నారని చెప్పి నా కొడుకు కూడా వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ అంటూ ఆత్మబలిదానం చేసుకుండు. నా కొడుకు ఆత్మబలిదానం చేసుకోవడానికి కాంగ్రెస్ పాలకులు, చిదంబరం ప్రకటనే కారణం. అయ్యాల చేసిందంత చేసి ఇప్పుడు మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి సారీ అంటే సరిపోతదా? ఇంత మంది పిల్లలు చనిపోవడానికి చిదంబరం ప్రకటనే కారణం. నా లాంటి తల్లుల ఉసురు చిదంబరానికి, కాంగ్రెస్ పార్టీకి తప్పక తాకుతది.
– పిల్లి రాములు, సైదమ్మ, ముకుందాపురం, నిడమనూరు మండలం