కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన లేదు. ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చాక మొండి చెయ్యి చూపిస్తున్నది. ఇందుకు ఉదాహరణే నేతన్న భరోసా పథకం. అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా ఈ పథకం పత్తా లేదు. ఒకసారి మార్గదర్శకాల పేరుతో.. మరోసారి దరఖాస్తుల పేరుతో హడావుడి చేయడం తప్ప నేతన్నలకు ఒరిగిందేమీ లేదు.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : చేనేత కార్మికులకు జీవనోపాధి కల్పించేందుకు చేనేత అభయహస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత భరోసా పథకం రూపొందించింది. ఈ సీం కింద చేనేత కార్మికులకు ఏడాదికి గరిష్టంగా రూ.18 వేలు, రెండు విడతల్లో రూ.9 వేల చొప్పున వస్తాయి. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయి. అనుబంధ కార్మికులకు ఏడాదికి రూ.6 వేలు అందుతాయి. రెండు విడతల్లో రూ. 3 వేల చొప్పున వస్తాయి. అంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఊదరగొట్టింది.
మార్గదర్శకాల పేరుతో ఆర్భాటం
నెల రోజుల్లో కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని, నాలుగు నెలల క్రితం చెప్పినా నేటికీ చేనేత కార్మికులకు భరోసా అంద లేదు. మార్గదర్శకాల పేరుతో ప్రభుత్వం ఆర్భాటం చేసింది. అనేక నిబంధనలు పెట్టింది. 18 ఏండ్లు నిండిన చేనేత, అనుబంధ కార్మికులు ఇందుకు అర్హులు. జియో-ట్యాగ్ చేసిన మరమగ్గాలపై పనిచేయాలి. డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్ లాంటి ప్రీలూమ్/ప్రిపరేటరీ పనులు చేయాలి. చేనేత వృత్తి ద్వారా వార్షిక ఆదాయంలో కనీసం 50 శాతం సంపాదించాలి. కార్మికులు కనీసం 50 శాతం వార్పు పనులు పూర్తి చేయాలి. మొదటి విడతలో 50 శాతం వార్పు పూర్తి చేయని వారు.. రెండో విడతలో టార్గెట్ హిట్ చేస్తే, ఏడాది చివర్లో పూర్తి సాయం అందుతుంది. ఆర్థిక సాయం ఏడాదికి రెండు విడతల్లో ఏప్రిల్-సెప్టెంబర్, అక్టోబర్-మార్చి లో అందిస్తామని చెప్పింది. ప్రభుత్వం ఇంతహడావుడి చేసినా అడుగు ముందుకు పడలేదు.
దరఖాస్తులకే పరిమితం
నేతన్న భరోసా పథకానికి జూలైలో నిధులు విడుదల చేశామని చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నేత కార్మికుల నుంచి దరఖాస్తులు సైతం స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 5250 మంది నేతకార్మికులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకొని.. ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాల సాయం అందాల్సి ఉన్నా.. నేటికీ ఈ పథకం కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం మగ్గానికి లేబుళ్లు రావాలని, అవి స్టిక్ చేశాకే పథకం ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు.
నాటి పథకానికి తిలోదకాలు
నాటి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేనేత మిత్ర పథకం తీసుకొచ్చారు. కార్మికులకు రసాయనాలు, నూలుపై 40 శాతం రాయితీ కల్పించారు. కొందరికి అవగాహన లేకపోవడం, సబ్సిడీ పొందే ప్రక్రియ తెలియక దాన్ని పొందలేకపోయారు. దీని స్థానంలో మగ్గం మీద పనిచేసే ప్రతి కార్మికుడికీ నెలనెలా రూ.3వేల సాయం చేయాలని భావించారు. కార్మికుల బ్యాంకు ఖాతాలో రూ. 3వేలు జమ చేశారు. ఇందులో నేత కార్మికుడికి రూ.2వేలు, అనుబంధ కార్మికులకు రూ.వెయ్యి ఖాతాల్లో జమ చేశారు.కాంగ్రెస్ సరారు వచ్చాక పైసా ఇవ్వలేదు. సర్కారు ఈ పథకాన్ని నిలిపివేసింది.