నేరేడుచర్ల, సెప్టెంబర్ 26 : వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 2025 మార్చి 29 నాటికి ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి పదవీకాలం పూర్తి కానుండడంతో తదుపరి ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితా రూపొందించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 30 నుంచి ఓటు నమోదుకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో కొత్తగా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలనుకునే వారి కోసం ఎన్నికల కమిషన్ పలు సూచనలు చేసింది. ఉపాధ్యాయ ఓటరుగా నమోదు కావడానికి కావాల్సిన అర్హతలను తెలిపింది. జిల్లాలోని పరిషత్ పాఠశాలలతో పాటు ఎయిడెడ్, జూనియర్, డిగ్రీ కళాశాలలో పనిచేసే బోధనా సిబ్బంది కూడా ఓటు హక్కు పొందేందుకు అర్హులు.