సూర్యాపేట, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట పట్టణంలో ఇసుక బంగారమైపోయింది. ప్రస్తుతం ఏ చిన్న నిర్మాణం చేపట్టి, ఓ ట్రాక్టర్ ఇసుక తెప్పించుకోవాలన్నా రూ.8,500 నుంచి రూ.10వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. జిల్లా అధికార యం త్రాంగం ఇసుక కోసం ఆన్లైన్ పద్ధతి అమలు చేస్తు న్నా ఆచరణలో శూన్యం. బుక్ చేసుకున్న వారంలో రావాల్సిన ఇసుక మూడు నెలల దాటినా రావడం లేదు. దీంతో చిన్న చిన్న మరమ్మతు పనుల నుంచి పెద్ద పెద్ద ఇండ్ల నిర్మాణ పనులు సైతం నిలిచిపోతున్నాయి.
ఇందిరమ్మ ఇండ్లకు మాత్రం ఎలాంటి ఢోకా లేదని ఇసుక దొరుకుతుందని గృహనిర్మాణ శాఖ అధికారులు చెబుతుండగా ప్రైవేట్ నిర్మాణాలకు మాత్రం అధిక ధర చెల్లించి, దొంగ చాటుగా కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, అధికార యం త్రాంగం కక్కుర్తితో రోజురోజుకూ ఇసుక ధర పెరుగుతూ వస్తోంది. నాలుగేళ్ల క్రితం వరకు సూర్యాపేట పరిసర ప్రాంతాల నుంచి ట్రాక్టర్ల ద్వారా వచ్చే ఇసుక ధర రూ.1500 నుంచి 1800 వరకు పలికేది.
అలాంటిది నేడు సూర్యాపేటలో ట్రాక్టర్ ఒక్కంటికి రూ.8500లకు చేరుకుంది. వాగుల్లోని నీళ్ల కారణం గా ఇసుక రావడం లేదని చెబుతున్నప్పటికీ సూర్యాపేట పట్టణంలోకి మాత్రం అర్ధరాత్రి దాటిన తరువాత విచ్చలవిడిగా వస్తోంది. జిల్లాలోని జాజిరెడ్డిగూడెం, తాటిపాముల, పేరబొయినగూడెం, నందాపురం, కొత్తగూడెం, బిక్కుమళ్లతో కలిపి మొత్తం ఆరు రీచ్‌లను గుర్తించి ప్రభుత్వం ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టింది. మరో పక్క అనధికార ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టింది. ఇలా అరికట్టడం ద్వారా ఇసుక ధరలు తగ్గుతాయని అనుకుంటే అమాంతం పెరిగింది. దీంతో ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే ఎప్పు డు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని భవన నిర్మాణ దారులు వాపోతున్నారు.

మూడు నెలలైనా రాలేదు..
జిల్లా యంత్రాంగం ఇసుక విక్రయాలను ఆన్లైన్ చేస్తూ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపింది. ఈ విధానం కొంతకాలం సజావుగానే కొనసాగింది. తదనంతరం బుక్ చేసిన రెండు నుంచి మూడు నెలల వరకు ఇసుక రాకపోగా బ్లాక్‌లో దొరకడం ప్రారంభమైంది. సూర్యాపేట పట్టణానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఆగస్టులో రూ.4,319 చెల్లించి మీ సేవ ద్వారా ఇసుక బుక్ చేస్తే ఇప్పటి వరకూ రాలేదు. ఈ విషయమై సంబంధిత తాసీల్దార్‌ను అడిగితే నాకు తెలియదు…ఏట్లో నీళ్లు ఉన్నందున ఇసుక రావడం లేదంటున్నారని తన డబ్బులు రిటర్న్ ఇవ్వమంటే ఎక్కడ బుక్ చేశారో అక్కడికే వెళ్లి అడుక్కో అంటూ సమాధానం చెబుతున్నాడని వాపోయాడు. తీరా మీ సేవకు వెళితే ఆసలు క్యాన్సిలేషన్ ఆప్షనే లేదని చెబుతున్నారన్నాడు.
నిలిచిన ఆన్లైన్.. బ్లాకులో హై రేట్..
ఆన్లైన్ ద్వారా బుక్ చేస్తే ఇసుక రాకపోగా బ్లాకులో మాత్రం విచ్చలవిడిగా దొరుకుతోంది. కాకుంటే ధర లు చూస్తే గుండె దడ పుట్టాల్సిందే. ట్రాక్టర్ ఒక్కంటికి రూ.8500 ఉండగా కాస్త తగ్గించమని అడిగితే ఇష్టం ఉంటే తీసుకో లేకుంటే ఇతరులకు ఇస్తామని అక్రమార్కులు చెబుతున్నారు. మేం ఎంతో రిస్క్ తీసుకొని తెస్తున్నాం…ఎవరైనా అధికారులు పట్టుకుంటే మామూలు ఇస్తే ఐదు వేలు…కేసు చేస్తే రూ.20 నుంచి రూ.30వేలు అవుతుందని, అందుకే మూమూళ్లు ఇస్తు అర్ధరాత్రి సమయాల్లో వాగుల్లో నుంచి ఇసుకను తోడి తీసుకువస్తున్నామని చెబుతున్నారు.
ధర పెరగడంతో అత్యవసరమైతేనే ఇసుకను కొనుగోలు చేస్తుండటంతో నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. ఒకవేళ ఎవరైనా ఇసుకను ఆంధ్రా నుంచి తెచ్చినా అదీ దొంగతనంగానే తెచ్చుకోవాల్సి వస్తోం ది. ఇందిరమ్మ ఇండ్లకు దొరుకుతున్న ఇసుక ప్రైవేట్ వారికి దొరక్కపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ ద్వారా ఇసుక దొరకనందున కనీసం ఏట్లో నీళ్లు పోయేంత వరకైనా అధికారయంత్రాంగం ఇసుకను ఫ్రీగా ఇస్తే నిర్మాణాలు సజావుగా సాగుతాయని అంతే కాకుండా ధరలు కూడా తగ్గుతాయని పలువురు నిర్మాణ దారులు చెబుతున్నారు.
ఆన్లైన్ బుకింగ్ లేదు..

ఇంటి నిర్మాణం చేద్దామంటే అన్నింటికీ ఒక లెక్క ఇసుక దగ్గరకు వస్తే ఓ లెక్క అన్నట్లుగా ఉంది పరిస్థితి. ప్రభు త్వం ఇసుకను ఆన్లైన్ చేయడంతో తిప్పలు మొదలయ్యాయి. మొదట ఎవరో ఒకరు అడ్డా మీద పెట్టి ఇసుకను విక్రయిస్తే అక్కడకు వెళ్లి ఏదో ఒక ధరకు తెచ్చుకునేటోళ్లం. కానీ ప్రభుత్వం ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం తో ఆన్లైన్లోనే కాదు బ్లాక్‌లో కూడా దొరకడం లేదు. ఇసుక ఒకవేళ బ్లాకులో దొరికినా ట్రిప్పు రూ.8నుంచి 10వేల వరకు విక్రయిస్తున్నారు. ఆన్లైన్ ప్రక్రియ కూడా కొద్ది రోజులుగా అందుబాటులో లేకపోవడంతో ఇసుక కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని బిల్డర్లు నిర్మాణ రంగంలో అడుగు పెడితే ఇసుక దొరక్క నిలువునా మునిగే పరిస్థితి నెలకొంది.
-సోమగాని వేణుగౌడ్, బిల్డర్, సూర్యాపేట