నిడమనూరు, సెప్టెంబర్ 20 : సమాజ ఉన్నతిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం, తాసీల్దార్ జంగాల కృష్ణయ్య అన్నారు. నిడమనూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 22 మంది ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి మెమొంటో, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజ నిర్మాణం ఉపాధ్యాయుల కృషి పైనే ఆధారపడి ఉందన్నారు.
ఉత్తమ పౌరులను తీర్చిదిద్ది సమాజానికి అందించే గురువుల ప్రాధాన్యం నేటి ఆధునిక యుగంలోనూ తగ్గలేదన్నారు. సమాజ నిర్మాణంలో ఉత్తమ పౌరులను అందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని కోరారు. ఎంఈఓ లావూరి వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు నాగజ్యోతి, గోపి, శ్రీ వెంకట్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాంపాటి శ్రీనివాసులు, కొమ్మరాజు సైదులు, మురారి శెట్టి రమేశ్, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.