నల్లగొండ ,నవంబర్ 14 : ఎన్నికలు స్వేచ్ఛయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని కేంద్ర ఎన్నికల పరిశీలకులు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో మంగళవారం మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ విధానాన్ని పరిశీలిస్తూ ఎలాంటి తప్పిదాలు ఉల్లంఘనలు జరిగిన రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకుల దృష్టికి తీసుకుపోవాలన్నారు. పోలింగ్‌కు గంట ముందు మాక్ పోలింగ్ నిర్వహించాలని , పోలింగ్ స్టేషన్లు పరిశీలించాలని సూచించారు. అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటూ, ఓటర్లు వరుస క్రమంలో వచ్చేలా చూడాలన్నారు. పోలింగ్ విధానాన్ని పరిశీలించి మైక్రో అబ్జర్వర్లకు ఇచ్చిన ఫార్మట్‌లోనే నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రంలో పోలింగ్ విధానాన్ని , ఈవీఎం, వీవీ ప్యాడ్లను వినియోగించే విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించాలన్నారు. మైక్రో అబ్జర్వర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫారం- 12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ ఆర్.వీ. కర్ణన్ ,పరిశీలకులు అవినాశ్, చఫాపంవత్ కన్నన్ పాల్గొన్నారు.
రెండో విడుత ర్యాండ్మైజేషన్ ప్రక్రియ
సాధారణ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం పోలీస్ సిబ్బందికి రెండో విడుత ర్యాండ్మైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్.వీ .కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది ఆయా నియోజకవర్గాల్లో పనిచేస్తున్న వారికి వేరే నియోజకవర్గాల్లో విధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ నెల 30 న పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అనంతరం పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే ప్రీసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రీసైడింగ్ అధికారులు , ఇతర అధికారులను రెండోవిడుత ర్యాండ్మైజేషన్ ద్వారా నియోజకవర్గాలకు కేటాయించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియ సాధారణ ఎన్నికల పరిశీలకులు బాలసుబ్రహ్మణ్యం , ఆర్.కన్నన్, అవినాశ్, చపాంవత్ సమక్షంలో నిర్వహించారు.