– ఒక్కో రాయికి ఒక్కో నాదం
– అయిటిపాములలో కనువిందు చేస్తున్న మ్యూజికల్ స్టోన్స్
కట్టంగూర్, జనవరి 19 : నాద బ్రహ్మ శిలా రూపం దాల్చాడు. సంగీతానికి రాళ్లు కరుగుతాయంటుంటారు. రాళ్లు రాగాలు పలుకుతాయి అంటుంటారు. చెట్టు, పుట్ట, కొండ, కోన, రాయి రప్పల్లో సంగీతం ప్రతిధ్వనించిందని ఎప్పుడైనా చూశారా. రాళ్లు నానా వినోదాన్ని పంచే అద్భుతాన్ని ఎప్పుడైనా విన్నారా. మనుషులు రాళ్లతో అగ్ని పుట్టించారు. రాళ్లతో చక్కటి విగ్రహాలు తయారు చేస్తారని మనకు తెలుసు. రాళ్లను కొడితే మంచి మ్యూజిక్ తో పాటు గంట కొట్టినట్లు చప్పుడు కూడా వస్తుంది. అలాంటి మ్యూజికల్ స్టోన్స్ నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో నగారా గుట్టపై ఆకట్టుకుంటున్నాయి. గ్రామ శివారులో కొన్ని గుట్టలున్నాయి. పూర్వీకుల కాలం నుంచి దీనిని గుర్తించిన వారు దీనిని నగారా గుట్ట అని పిలుస్తుంటారు. వాటిలో కొన్ని రాళ్ల నుంచి సంగీతం వినబడుతుంది. ఆ శబ్దం కూడా గుడిలో గంట కొట్టినట్టుగా వినిపిస్తుంది. ఇక్కడ ఒక రాయిని కొడితే కంచు, మరోక దానిని కొడితే ఐరన్ మోగినట్లు వినిపిస్తున్నాయి.
పూర్వం రాజులు ఈ కొండను గ్రామానికి రక్షణ కవచంగా, శత్రుమూకల రాకలను పసిగట్టేందుకు శబ్దం చేసేందుకు ఈ రాళ్లను వినియోగించుకునే వారని స్థానికులు చెబుతుంటారు. అప్పటి నుండి ఈ కొండను నగారా ఏనె అని పిలుస్తుంటారు. గ్రామస్తులతో పాటు ఇతర గ్రామాల ప్రజలు సెలవుల సమయంలో ఇక్కడికి వచ్చి రాళ్లను మోగిస్తూ నాద స్వరాలను విని ఆహ్లాదాన్ని పొందుతారు. కొండపై ఎన్నో రాళ్లు ఉండగా అందులో మూడు రాళ్ల నుండి మాత్రమే స్వరాలు పలుకుతుండటం ఆశ్చర్యం. ఇక సంగీత ప్రియులకు ఎక్కడ లేని సంతోషం కలిగిస్తుంటే చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పక్క పక్షల కిలకిలా రాగాలు, మరోవైపు సంగీత స్వరాలు వినిపించే ఈ నగారా గుట్ట అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. స్వరాలు పలికే రాళ్లు హంపి దేవాలయంలో మాత్రమే ఉన్నాయంటున్నారు. ఇలాంటి వాటిని పురావస్తు శాఖ వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విశిష్టమైన రాళ్లను ప్రపంచానికి తెలియజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పర్యాటక కేంద్రంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Kattangur : రాగాలు పలుకుతున్న ఏనె రాళ్లు… సంగీతం పలికే శిలలు
సంగీత స్వరాలు వినిపించే ఈ నగారా గుట్టను పురావస్తు శాఖ అధికారులు వెలుగులోకి తీసుకురావాలి. పచ్చని పంట పొలాలు మధ్య నల్లని కొండ చూడముచ్చగా ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. గ్రామస్తులు మాత్రం తాతల కాలం నుండి కాపాడుకున్న సంపదగా భావిస్తున్నరు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుండి ఎంతోమంది నగారా గుట్టకు వచ్చి ఆహ్లాదాన్ని పొందుతున్నారు.

Kattangur : రాగాలు పలుకుతున్న ఏనె రాళ్లు… సంగీతం పలికే శిలలు