కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసిందా..? రైతు భరోసా అమలులో అన్నదాతకు మొండిచెయ్యి చూపించిందా..? యాసంగి సీజన్లో పెట్టుబడి అందని రైతులకు ఎగనామం పెట్టినట్టేనా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. యాసంగి సీజన్లో పూర్తిగా అమలు చేయకుండానే.. వానకాలం సీజన్ సాయం ప్రారంభించడంతో ఇక డబ్బులు ఎగవేసినట్లేననే ప్రచారం జరుగుతున్నది. గతంలోనూ ఓ సీజన్ మొత్తం రైతు భరోసా బంద్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
యాదాద్రి భువనగిరి, జూన్ 17 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం 2018లో రైతుబంధు పథకం తీసుకొచ్చింది. అందులో భాగంగా ఏటా రెండుసార్లు ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయంగా డబ్బును బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. పంట సాగు సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా బీఆర్ఎస్ ప్రభుత్వమే పెట్టుబడి సాయం చేసింది. ప్రతి సీజన్ ప్రారంభంలోనే అడగక ముందే డబ్బులు అకౌంట్లో వేసి ఆదుకుంది. ఎంత భూమి ఉన్నా అర్హులైన అందరికీ వర్తింపజేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని సీజన్లు కలుపుకొని రూ.2,508 కోట్లను 2,33,461 మంది రైతు ఖాతాల్లో సాయం జమ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏటా ఎకరాకు రూ.15వేల సాయం చేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని వాగ్దానం చేసింది. అదీ 2023 డిసెంబర్ 9వ తేదీన ఇస్తామని ప్రకటించింది. కానీ ఆ సీజన్లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5వేల జమ చేసినట్లే ఇచ్చి చేతులు దులుపుకొంది.
యాసంగి సీజన్లో రైతు భరోసా అందించడానికి ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టింది. కొత్తగా నిబంధనలు రూపొందించాలని, అనర్హులను ఏరివేయాలని తీవ్ర జాప్యం చేసింది. మంత్రివర్గ ఉప సంఘం కమిటీ పేరుతో కాలయాపన చేసింది. సాగు చేయడంలేదంటూ కొందరికి కోత పెట్టింది. యాసంగిలో మొత్తం 2.40 లక్షల మందికి సుమారు రూ.280 కోట్ల వరకు రైతు భరోసా అమలు చేయాలని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. సీజన్ ప్రారంభంలోనే పెట్టుబడి సాయం అందాల్సి ఉండగా.. కొందరికి మాత్రం మధ్యలో జమ చేశారు. మొత్తానికి యాసంగి సీజన్లో 1,88,526 మంది రైతులకు రూ.174 కోట్లు మాత్రమే జమ చేసింది. అది కూడా మూడెకరాల లోపు వారికి మాత్రమే డబ్బులు జమయ్యాయి. అంటే సుమారు 52 వేల మందికి ఇంకా రూ.106 కోట్ల వరకు డబ్బులు జమ కావాలి. వీరంతా తమ ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారోనని ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏకంగా వానకాలం సీజన్ డబ్బులు జమ షురూ చేయడంతో ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి.
2023 అధికారంలోకి వచ్చిన కొత్తలో యాసంగిలో పెట్టుబడి సాయం అందించింది. ఆ తర్వాతి వానకాలం సీజన్ మొత్తానికే రైతులకు ఎగనామం పెట్టింది. యాసంగిలో కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లు ఎకరాకు రూ.5వేల సాయం కూడా ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేసింది. ఆ సీజన్లో 2.40లక్షల మంది రైతులకు సుమారు రూ. 290 కోట్లు ఇవ్వకుండా మోసం చేసింది. దీంతో కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేసేదేం లేక.. బ్యాంకుల్లో అప్పటికే రుణాలు తీసుకోవడంతో బయట ప్రైవేట్‌గా వడ్డీలకు అప్పులు తెచ్చుకున్నారు. కాగా, ప్రస్తుత వానకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో మంగళవారం మూడెకరాల వరకు ఉన్న రైతులకు పెట్టుబడి సాయం డబ్బులు ఖాతాల్లో చేశారు. 1,33,736 మంది రైతులకు రూ. 72.62 కోట్లు అకౌంట్లో వేశారు.
నాకు రెండు ఎకరాల 25గుంటల వ్యవసాయ భూమి ఉంది. గత బీఆర్ఎస్ సర్కారులో సీజన్‌కు రూ.13,500 పెట్టుబడి అందేది. కానీ కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక ఒక్క రూ పాయి కూడా అందలేదు. రేవంత్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులే తగిన బుద్ధి చెప్తారు.