నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సూర్యాపేట జిల్లాలో సాగు జోరందుకున్నది. రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. శనివారం సూర్యాపేట మండలం ఎర్కారం సమీపంలో నాటు వేసే సమయంలో మహిళా కూలీలు సెల్ఫీ దిగుతున్న దృశ్యమిది.
-సూర్యాపేట ఫొటోగ్రాఫర్, నమస్తే తెలంగాణ
హాలియా, జూలై 22 : ఈ ఏడాది వరుణుడు కరుణించక నాగార్జున సాగర్ జలాశయంతోపాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీరు అడుగంటింది. ముఖ్యంగా కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల్లో ప్రస్తుతం తాగునీటికి తప్ప సాగుకు సరిపడా నీరు లేదు. అయినా.. నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో మాత్రం రైతులు ధైర్యంగా వరి సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడం, 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
పెరిగిన భూగర్భ జలాలు
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చెరువులు, కుంటలు 220 వరకు ఉన్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద రూ.40 కోట్లతో 4 దశల్లో చెరువుల మరమ్మతులు చేయించింది. పూడిక మట్టి తీయడంతో వర్షపు నీరు చేరి చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. దీనికితోడు నీటి వృథాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాగులు, వంకలపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టింది. తొమ్మిదేండ్లలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సుమారు 30 కోట్ల రూపాయలతో చెక్‌డ్యామ్‌లు నిర్మించింది. దాంతో భూగర్భ జల మట్టం అమాంతం పెరిగింది. దీనికితోడు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంతో రైతులు బేఫికర్‌గా వరి సాగు చేస్తున్నారు.
10వేల ఎకరాల్లో వరి నాట్లు
గత ఏడాది నాగార్జున సాగర్ జలాశయంలో నీరు సమృద్ధిగా ఉండటంతో ప్రభుత్వం సాగర్ ఎడమ కాల్వకు ఆగస్టు మొదటి వారంలో నీటి విడుదల చేసింది. దీంతో గత ఏడాది వానకాలం నియోజకవర్గంలో లక్షా 18వేల ఎకరాల్లో వరి సాగైంది. ఈ ఏడాది నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 518 అడుగుల నీరు మాత్రమే ఉన్నది. మరో 8 అడుగులు తగ్గితే డెడ్ స్టోరేజీకి వచ్చే ప్రమాదం ఉన్నది. ప్రస్తుతం ఉన్న నీళ్లు తాగునీటి అవసరాలకే సరిపోతాయి. కాబట్టి సాగుకు విడుదల చేయడం సాధ్యం కాదు. ఇప్పటికీ రాష్ట్రంలో, ఎగువ ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ వర్షపాతం కురువకపోవడంతో నాగార్జున సాగర్ జలాశయంలో నీరు అంతంత మాత్రంగానే ఉన్నది. సాగర్ జలాశయం నిండి సాగునీరు వచ్చేసరికి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉన్నది. అప్పటిదాకా ఆగితే ఆలస్యమైతుందనుకున్న రైతులు బోరుబావుల సహాయంతో వరి సాగు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10వేల ఎకరాల్లో వరి నాట్లు వేసినట్లు అంచనా.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు డబుల్
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గతంతో పోల్చితే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా 1,28,170 మంది విద్యుత్ వినియోగదారులు ఉండగా, అందులో 70,891 మంది గృహ, 8,318 మంది కమర్షియల్, 46,211 మంది వ్యవసాయ, 474 పారిశ్రామిక, 2,150 ఇతర విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. 60 ఏండ్ల కాలంలో కాంగ్రెస్, టీడీపీ హయాంలో నియోజకవర్గంలో 22,792 మంది రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటే.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా 23,419 మంది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీసుకున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 46,211 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
24గంటల కరెంట్ ఇవ్వడం వల్లే వరి సాగు చేస్తున్నాం
నాలుగేండ్ల క్రితం నేను బోరు వేశాను. 4ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్లే రైతులం ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేయగల్గుతున్నాం. ఉచిత విద్యుత్ ఇవ్వకుంటే వరి సాగు చేయలేం. నాగార్జున సాగర్ నిండి సాగునీరు రావాలంటే రెండు నెలలు పడుతది. అందుకే బోర్ల సహాయంతో వరి సాగు చేస్తున్నాం. భూగర్భ జలం సమృద్ధిగా ఉండడం, 24 గంటల కరెంట్ ఇస్తుండడంతో వరి సాగు చేసుకుంటున్న.
– చిమట మట్టయ్య, కంపాలపల్లి, త్రిపురారం మండలం