వేములపల్లి, మార్చి 22 : మండలంలో ఇసుక మాఫియా చెలరేగిపోతున్నది. రాత్రి, పగలు తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రశ్నించిన వారిని, ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఇసుక రీచ్‌లో ఫొటోల కోసం వెళ్లిన విలేకరులపైనా దాడులకు దిగుతున్నది. అధికార పార్టీ అండదండలతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు.
మండలంలోని రావులపెంట గ్రామ సమీపంలో పాలేరు వాగు నుంచి మూడ్రోజులుగా అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారు. స్థానికంగా ఉన్న కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకునేలోపు జారుకుంటున్నారు. ఇటీవల ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి ఇసుక సరఫరా నిలిచిపోయింది. దళారులు ఇసుకను అక్రమంగా తరలిస్తూ.. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి అందివ్వడం లేదని, అధిక ధర చెల్లిస్తే ఇసుక పంపిస్తున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు. అక్రమ రవాణాను అరికట్టి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఇసుక సరఫరా చేయాలని కోరుతున్నారు.
మండలంలో పాలేరు, మూసీ వాగుల నుంచి అధికార పార్టీ అండదండలు ఉన్నవారు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అధికారులు ఏం చేయలేక వదిలేస్తున్నారు. వాహనాలను పట్టుకుంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇసుక రవాణాపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. స్థానికంగా ఉన్న విలేకరులపై దాడులు చేయడానికి కూడా వెనుకాడడం లేదు.
శనివారం పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. పోలీసులు అక్కడికి చేరుకుని నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన విలేకరులు ఫొటోలు తీస్తుండగా, ఇసుక మాఫియాకు చెందిన ఉత్తెర్ల సురేశ్ అనే వ్యక్తి నమస్తే తెలంగాణ వేములపల్లి మండల విలేకరిని దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. ‘పోలీసులే పట్టుకోవడం లేదు.. మీరెందుకురా వస్తున్నారు’ అంటూ దౌర్జన్యం చేశాడు. మీ అంతు చూస్తామంటూ బెదిరించాడు.
స్థానికులు అందించిన సమాచారం మేరకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను పోలీసులు పట్టుకున్నట్లయితే అధికార పార్టీ వారి నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. దీంతో చేసేదేమీ లేక వాహనాలను కేసులు లేకుండా వదిలివేయాల్సి వస్తున్నట్లు తెలుస్తున్నది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను అరికట్టాలని ఒక వర్గం ఒత్తిడి తెస్తుంటే.. పట్టుకున్న వాహనాలను వదిలిపెట్టాలని మరో వర్గం నుంచి పోలీసు వ్యవస్థపై ఒత్తిడి తెస్తున్నారు.
దీంతో స్థానికంగా పనిచేస్తున్న పోలీసు అధికారులకు ఇసుక రవాణా తలనొప్పిగా మారింది. ఉన్నతాధికారులు దృష్టి సారించి రెవెన్యూ, మైనింగ్, పోలీసుల సమన్వయంతో అక్రమ రవాణాను అరికట్టాలని, ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి వినియోగదారులకు ఇసుక అందించాలని పలువురు కోరుతున్నారు. కాగా, శనివారం పోలీసులు నాలుగు ఇసుక ట్రాక్టర్లు పట్టుకోగా.. పోలీస్‌స్టేషన్‌కు రెండు ట్రాక్టర్లనే తరలించడం గమనార్హం.
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కేసులను నమోదు చేస్తున్నాం. ఫిర్యాదులు రాగానే స్పందిస్తున్నాం.
– డి. వెంకటేశ్వర్లు, వేములపల్లి ఎస్ఐ