స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధమవుతున్నది. అధికార యంత్రాంగం.. రాజకీయ పార్టీలు వారి పనుల్లో బిజీ అయ్యాయి. జిల్లాలో బ్యాలెట్ పేపర్ల ముద్రణ ఇప్పటికే పూర్తయింది. వార్డుల వారీగా ఓటరు జాబితా తయారు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. గ్రామాల్లో ఎన్నికల తరహా హడావిడి మొదలైంది. బరిలోకి దిగేందుకు వివిధ పార్టీ నుంచి ఆశావహులు సిద్ధమవుతున్నారు. మరోవైపు స్థానాల రిజర్వేషన్‌పై ఉతంఠ నెలకొంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో గతంలో 421 పంచాయతీలు ఉండగా, కొత్తగా ఏడు పంచాయతీలను ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 428కి చేరింది. మొత్తం 5,20,441 మంది ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ల పదవీ కాలం గతేడాది ఫిబ్రవరి ఒకటిన ముగియగా, ప్రస్తుతం ప్రత్యేక అధికార పాలన కొనసాగుతున్నది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం పనుల్లో నిమగ్నమైంది.
గ్రామాల్లో ఆశావహులు ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తూ దావత్ ఇస్తూ మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పండుగలకు పెద్దఎత్తున ఖర్చు పెడుతున్నారు. డబ్బులకు వెనకాడకుండా లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీల రహితంగా జరుగనుండడంతో పోటీ పడేవారి సంఖ్య అధికంగానే ఉండనుంది. ప్రజల్లో గుర్తింపు పొందేందుకు వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా పార్టీల మద్దతు కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. మరో వైపు ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు రెడీ అవుతున్నాయి. ఎన్నికల్లో తమ మద్దతు ఉన్నవారినే గెలిపించి సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు ఆర్వో, ఏఆర్వో జాబితా ఫైనల్ అయింది. గ్రామాల్లో ఓటరు జాబితా ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. వార్డుల వారీగా జాబితాను రూపొందిస్తున్నారు. తాజాగా ఎన్నికల నిర్వహణ కోసం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. మంగళవారం పలువురు అధికారులు హైదరాబాద్‌లో శిక్షణ తరగతులకు హాజరయ్యారు. బుధవారం మరో బ్యాచ్ వెళ్లనుంది. వారి శిక్షణ అనంతరం.. జిల్లాలో ఇతర అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమమాలు ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాలో బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం సర్పంచ్ అభ్యర్థులకు 30 రకాలు, వార్డు సభ్యుల అభ్యర్థులకు 20 రకాల గుర్తులను కేటాయించారు. సర్పంచులకు సంబంధించి గులాబీ కలర్ బ్యాలెట్ పేపర్, వార్డు సభ్యులకు తెల్ల రంగు బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేశారు. సర్పంచులుగా పోటీ చేసే వారికి ఉంగరం, కత్తెర, ఫుట్‌బాల్, బ్యాట్, బ్యాట్స్‌మెన్, స్టంప్స్, టీవీ రిమోట్, టూత్ పేస్ట్ వంటి 30 రకాల గుర్తులను కేటాయించారు. వార్డు సభ్యులకు పొయ్యి, స్టూల్, బీరువా, గ్యాస్ సిలిండర్, గౌన్, ఈల, కుండ వంటి 20 గుర్తులను సిద్ధం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సర్వత్రా ఉతంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్లు తేల్చాకే ఎన్నికలకు వెళ్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా బీసీ కుల గణన నివేదికను వెల్లడించింది. దీని ఆధారంగా రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ గ్రామ సర్పంచ్ పదవికి ఏ రిజర్వేషన్ వర్తిస్తుందో, ఏ వార్డు ఎవరికి కేటాయిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.