సూర్యాపేట, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభు త్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. కార్యక్రమంలో భాగంగా ప్రభు త్వం ఏమైనా సాధించిందా అంటే శూన్యమనే చెప్పాలి. నయా పైసా నిధులు కూడా విడుదల చేయకపోవడంతో ఎలాంటి పనులూ జరగలేదు. పైగా ఈ కార్యక్రమంలో మచ్చుకు కూడా ఏనాడూ జనం కనిపించ లేదు. కేవలం అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఎస్‌హెచ్‌జీలను పిలిపించి అధికారులు ప్రసంగించి, ఫొటోలకు ఫోజులిచ్చి మమ అనిపించారు. అసలు బడ్జెట్ కేటాయించకుండా వంద రోజుల కార్యక్రమమంటూ ఎందుకు చేపట్టారో..ఎవరి కోసం పెట్టారో అర్థం కావడం లేదని జనం, పలువురు సర్పంచ్‌లు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి కలెక్టర్లందరితో మార్చి 3న రోజంతా సమావేశమై, చర్చలు జరిపి ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమం జూన్ 12న ముగిసింది. కానీ ఈ వంద రోజు ల్లో ప్రభుత్వం సాధించిన ఫలితం శూన్యం. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ప్రత్యేక కార్యక్రమం చేపడితే నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుంది. కానీ రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బడ్జెట్ కేటాయించకపోవడం గమనార్హం. దీంతో ఆయా గ్రామాల్లోని శానిటేషన్ సిబ్బందితో పారిశుధ్య పనులు తప్ప ఎలాంటి కార్యక్రమం చేపట్టకుండా కేవలం ఫొటోలకు ఫోజులిచ్చి వాట్సాప్, ఇన్స్టాగ్రాం లాంటి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంతోనే సరిపోయిందని సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామ సభలతో ప్రజల్లోకి వెళ్లాల్సి ఉండగా కాం గ్రెస్ ప్రభుత్వ పైఫల్యాలను జనం నిలదీస్తారనే భయంతో వేసవిలో మిట్టమధ్యాహ్నం పది నిముషాల పాటు కార్యక్రమం నిర్వహించి పలాయనం చిత్తగించారు.
బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో రోడ్లు, మురికి కాల్వలు, హరితహారం తదితర 15 నుంచి 20 కార్యక్రమాలను ప్రభు త్వం ప్రాధాన్యతా అంశాలుగా తీసుకున్నది. పల్లె ప్రగతి పేరిట నెలనెలా గ్రామ పంచాయితీలకు కోట్లాది నిధులు వచ్చాయి. దీంతో ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుందనుకుంటే అన్ని రంగాల్లో విఫలమై జనం చేత నిత్యం శాపనార్థాలు పెట్టించుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం చేపడితే పక్కా గా తమ గ్రామాలు కొద్దోగొప్పో బాగుపడతాయని అంతా భావించారు. అయితే సాధించిందీ.. చెప్పుకునేందుకు ఏమీ లేదు.
పంచాయితీలకు పాలకవర్గాలు వచ్చి ఆరు నెలలు గడిచినా ప్రభుత్వం నయాపైసా ఇవ్వలేదని, 99 రోజుల కార్యక్రమంలో నాలుగు సార్లు గ్రామ సభలు నిర్వహించారని, వాటికి పెట్టిన ఖర్చుతోనైనా గ్రామాల్లోని సిబ్బంది వేతనాలో.. లేక మరేదైనా పనో చేసుకునేవారమని సర్పంచ్‌లు వ్యాఖ్యానిస్తున్నారు. పంచాయతీల్లో తెలంగాణ గీతంతో ప్రారంభించి ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి సీఎం ప్రసంగం వినిపించడం, మైకులు, కుర్చీలు, తాగునీటితో పాటు అధికారులకు టీఏలు, డీఏలకు కలిపి ఒక్క రోజుకే దాదాపు రూ.25వేలు ఖర్చు చేయగా, నాలుగు సార్లు కలిపి రూ.లక్ష వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఒక వేళ ప్రభుత్వం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక చేపట్టకుండా రూ.లక్షను పంచాయతీలకు ఇచ్చినా ఎంతో కొంత పనులు జరిగేవంటున్నారు. ఇక నాలుగు సార్లు గ్రామ సభలు పెట్టి చెప్పిందే చెప్పి విసిగించారని రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల గురించి అడిగినా, ధాన్యం కొనుగోళ్లపై ప్రశ్నించినా.. ఇందిరమ్మ ఇం డ్లతో పాటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలపై ప్రశ్నిస్తే మాకు సం బంధం లేదు.. మేం రాజకీయ నాయకులం కాదు.. అంటూ జిల్లా పాలనాధికారులు ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెలనెలా పల్లె ప్రగతి పేరిట పెద్ద ఎత్తున నిధులు వచ్చేవి. కానీ కాంగ్రెస్ హయాంలో ఆరు నెలల క్రితం పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పాటైనా ఇప్పటి వరకు నయాపైసా ఇవ్వలేదు. బడ్జెట్ లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులం.. ప్రజల కోసం ఏదో ఒకటి చేసి వారి నమ్మకాన్ని కోల్పోకుండా ఉండాలంటే ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిందే. కానీ పైసా ఇవ్వడం లేదు.
-సంకరమద్ది నిరంజన్‌రెడ్డి, సర్పంచ్, నాగులపహాడ్