కొండమల్లేపల్లి, డిసెంబర్ 21 : రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ గాడి తప్పింది. గత రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో మగ్గడంతో గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయి. పాత సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన అనంతరం పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లాయి. ఈ సమయంలో అత్యవసర పనులకే ప్రాధాన్యత ఇచ్చి సమస్యాత్మక పనుల జోలికి వెళ్లలేదు. దీంతో గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
అయితే కొత్తగా గెలిచిన సర్పంచులు సోమవారం పగ్గాలు చేపట్టనున్నారు. కానీ కొత్తగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. నిధుల లేమితో రెండేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు కొత్త పాలకవర్గాలకు సవాల్‌గా మారబోతున్నాయి. సీసీ రోడ్లు, పారిశుధ్యం, డ్రైనేజీ కాల్వలు వంటి అభివృద్ధి పనులను నోచుకోకపోవడంతో పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, కరెంట్ బిల్లులు, తరుచుగా వచ్చే మోటార్ల రిపేర్లు, ట్రాక్టర్ నిర్వహణ ఖర్చులు ఆర్థికంగా పెనుభారంగా మారబోతున్నాయి. పంచాయతీ పగ్గాలు చేబట్టబోతున్న కొత్త పాలకవర్గాలన్నీ 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆశలు పెట్టుకున్నారు.
ప్రత్యేకాధికారుల పాలనలోనూ..
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సకాలంలో పంచాయతీలకు నిధులు మంజూరుతో పాటు ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. దీంతో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో ముందుకు సాగాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం, నిధులు మంజూరు చేయకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. నిధుల లేమితో పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారింది. కొన్నిచోట్ల పంచాయతీ ట్రాక్టర్లను నడిపేందుకు డీజిల్ కూడా లేని పరిస్థితి నెలకొంది. వీధిలైట్లు లేక గ్రామాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, మురికి కాల్వలు ఇలా చాలా వరకు అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు..
దేవరకొండ నియోజకవర్గంలోని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 22 ఉదయం 10.30 గంటలకు చేపట్టనున్నారు. నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లోనూ ఒకే సమయంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికైన అభ్యర్థులతో ప్రమాణం చేయించనున్నారు.
ఎస్ఎఫ్సీ నిధుల బకాయిలు..
గ్రామాల్లో పాత సర్పంచ్‌లు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులతో తాగునీటి పథకం, మురుగు కాల్వల నిర్మాణ పనులతో పాటు మెయింటనెన్స్ పనులు చేపట్టారు. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పలు నిర్మాణాలు చేపట్టారు. ముఖ్యంగా డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు, హరితహారం వంటి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలో జాప్యం జరిగింది. ఇంతలోనే పదవీ కాలం పూర్తయిందని పలువురు సర్పంచులు వాపోయారు. పాత బిల్లులు బకాయిలు చెల్లిస్తేనే బాగుంటుందని పాత సర్పంచులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఎస్ఎఫ్సీ నిధులు రావాల్సి ఉందని మాజీ సర్పంచ్‌లు పేర్కొంటున్నారు.