చందంపేట(దేవరకొండ), అక్టోబర్ 07 : నల్లగొండ జిల్లాలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సోమవారం దేవరకొండ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో దేవరకొండ, నాగార్జునసాగర్ ఎమ్మెల్యేలు నేనావత్ బాలునాయక్, జైవీర్రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేది వ్యవసాయ మార్కెట్ కమిటీ అన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, దేవరకొండ ప్రాంతంతోపాటు జిల్లాలో ఉన్న నకిరేకల్, మునుగోడు, సాగర్ నియోజకవర్గాలకు పూర్తి స్థాయిలో సాగు, తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2005 నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం ద్వారా సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 40 కిలోమీటర్ల మేర మేర సొరంగం పనులు పూర్తి కాగా మరో 9.5 కి.మీ. మేర పనులు మిగిలి ఉన్నాయని తెలిపారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అమెరికా నుంచి తెప్పించి మెషన్లతో 30 నెలల్లో ఎస్సెల్బీసీ పనులను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇప్పటికే రూ.18వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశామని, మిగిలిన వారికి త్వరలోనే పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటాని తెలిపారు. నల్లగొండ జిల్లాలో రోడ్ల కోసం ఆర్అండ్బీ ద్వారా రూ.516 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, సాగర్ ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి మాట్లాడుతూ అంగడిపేట-పీఏపల్లి రహదారి లైనింగ్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి గ్రామానికీ బీటీ రోడ్డు వేసి డబుల్ రోడ్డుకు విస్తరించాలని కోరారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ జమున మాధవరెడ్డి, వైస్ చైర్మన్ సర్వయ్యయాదవ్తోపాటు పాలకమండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే బాలునాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జేసీ శ్రీనివాస్, ఆర్డీఓ శ్రీరాములు, ఏడీ శారద, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, సిరాజ్‌ఖాన్, ముక్కమల వెంకటయ్యగౌడ్, జాన్‌యాదవ్, దేవేందర్‌నాయక్, హనుమంతు వెంకటేశ్‌గౌడ్, అరుణసురేష్‌గౌడ్, కొర్ర రాంసింగ్‌నాయక్, హరికృష్ణ, యూనస్, పాపానాయక్, బిక్కునాయక్, బద్యానాయక్, దేవేందర్‌నాయక్, మాధవరెడ్డి, రుక్మారెడి గోపాల్‌రావు పాల్గొన్నారు.