తిరుమలగిరి డిసెంబర్ 18: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, విద్యార్థుల సంఖ్య పెంచాలని, అమ్మ ఆదర్శ పథకం ద్వారా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మండలంలోని ఈదుల పర్రె తండా ప్రాథమిక పాఠశాల, భూక్యా తండా ,సిద్ధి సముద్రం తండాలో జీరో విద్యార్థుల పాఠశాలలు ఉన్నాయి. రాజానాయక్ తండాలో ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నారు. జేత్యా తండా, లాక్యా తండా, చౌళ్లతండా ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో మండలంలో 37 ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 912 మంది విద్యార్థులు మాత్రమే విద్యనభ్యసిస్తున్నారు..
ఇందులో ఒకటి నుంచి 7 గురు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 10 ఉన్నాయి. 1,2,3 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు 4 ఉన్నాయి. 4 నుంచి 7 గురు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 6 ఉన్నా యి. 13 పాఠశాలల్లో సింగిల్ టీచర్లు ఉన్నారు. మొత్తం 70 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే విద్యా సంవత్సరం చాలా పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని మేధావులు చెబుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ముందస్తుగా బడిబాట కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల సంఖ్య పెంచాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రభుత్వం ఏఐ ప్రవేశపెడుతున్నాం, ఇంగ్లీషు విద్యనందిస్తాం.. విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోటు బుక్స్, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం.. అని గొప్పలు చెప్పుకుంటున్నా విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగటం లేదు. విద్యార్థుల తల్లితండ్రులకు అధికారులు ,ఉపాధ్యాయులు భరోసా కల్పించటం లేదనే వాదనలు ఉన్నాయి.
మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రారంభించి , నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ఏర్పాటు చేసి విద్యార్థులపై ఒత్తిడి లేకుండా ఆటపాటలతో చదువు నేర్పించాల్సిన అవసరం ఉందని మేధావులు చెబుతున్నారు. వేసవిలో బడిబాట నిర్వహించి తల్లితండ్రుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రయత్నం చేయాలి. అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుండాలి. విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులను సమీప పాఠశాలల్లో విలీనం చేయా లి. అన్ని తరగతులకు ఉపాధ్యాయులను నియమించాలి. నాణ్యమైన విద్యను అందిస్తామనే నమ్మకం విద్యార్థుల తల్లి తండ్రులకు కల్పించాలి. అప్పుడు మాత్రమే విద్యార్థుల సంఖ్య పెరిగి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి.