సూర్యాపేట, డిసెంబర్ 30 : సూర్యాపేట జిల్లాలో నేరాల సంఖ్య పెరుగుతున్నది. మహిళా రక్షణ సైతం ఆందోళనకరంగా మారింది. 2023 సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. ఇసుక మాఫియా రెచ్చిపోయింది. సైబర్ క్రైమ్ కూడా 43శాతం పెరిగింది. దొంగతనాలు, గంజాయి, పీడీఎస్ మాఫియాపే కేసులూ పెరిగాయి. జాతీయ రహదారులే గాక గ్రామీణ ప్రాంత రోడ్ల మీద రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగాయి. ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ సోమవారం విడుదల చేసిన వార్షిక నేర నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
సూర్యాపేట జిల్లాలో 2023లో మహిళలపై లైంగిక దాడులు జరిగిన కేసులు 63 నమోదవగా, ఈ సంవత్సరం 84కి పెరిగాయి. వేధింపుల కేసులు గతేడాది 341 ఉండగా.. ఈ సారి 366, ఈవ్‌టీజింగ్ 67, కిడ్నాప్‌లు 28, హత్యలు 5, పిటీ కేసులు 98 నమోదయ్యాయి. షీటీమ్స్ ద్వారా 310 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 135 ఫ్యామిలీలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. భరోసా కేంద్రానికి 129 కేసులు వచ్చాయి. 88 మంది బాధితులను నష్టపరిహారం కోసం కలెక్టర్‌కు రెఫర్ చేశారు.
సైబర్, వైట్ కాలర్ నేరాలూ అధికమే :
ఈజీ మనీ కోసం సైబర్, వైట్‌కాలర్ నేరాలకు పాల్పడిన వారి సంఖ్య పెరిగింది. జిల్లావ్యాప్తంగా గతేడాదితో పొలిస్తే సైబర్ నెరాలు భారీగా పెరిగాయి. 2023లో 844 ఫిర్యాదులు వస్తే 2024లో 1,212 అందాయి. వాటిలో 205 కేసులు నమోదయ్యాయి. సైబర్ మోసాల్లో రూ.7,83,12,751 నగదు పోగా, వాటిలో రూ.39,04,664 రికవరీ చేశారు. బ్యాంకుల్లో రూ. 1,16,05,088 నగదు ఫ్రీజ్ చేశారు. గతేడాదితో పొల్చితే రికవరీ భారీగా పెరిగింది. వైట్ కాలర్ నేరగాళ్లు దందా పెరిగింది. 2023లో ఒక్క కేసు నమోదు కాగా 2024లో 12 కేసులు అయ్యాయి. అత్యధికంగా పీడీఎస్, సీఎంఆర్ దాందా కేసులు ఉన్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. అక్రమ ఇసుక దందా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా 178 పీడీఎస్ కేసులు నమోదు కాగా, 3,198 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. 289 మందిపై కేసులు నమోదు కాగా ఇద్దరిపై పీడీయాక్ట్ అమలు చేశారు.
జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. గతేడాదితో పోల్చితే జిల్లా వ్యాప్తంగా 154 శాతం కేసులు పెరిగాయి. 2023లో 205 కేసులు నమోదు చేసి 285 మందిని అరెస్ట్ చేయగా, 2024లో 522 కేసులు నమోదు చేసి 655 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇవి పోలీసులకు దొరికిన వారి లెక్కలు మాత్రమే. ముఖ్యంగా తుంగతుర్తి నియోజక వర్గంలో ఇసుక మాఫియా ఆగడాలు అధికంగా ఉన్నాయి.
37 శాతం పెరిగిన చోరీలు..
జిల్లాలో దొంగతనాల సంఖ్య కిందటేడు కంటే పెరిగింది. 2023లో 390 కేసులు ఉండగా, ఈ ఏడాది 536 నమోదయ్యాయి. 338 కేసులు డిటెక్ట్ చేశారు. మొత్తం 4,92,66,194 నగదు అపహరణకు గురికాగా, రూ.2,18,58,167 రికవరీ చేశారు. ఈ ఏడాది 1,780 సెల్ ఫోన్లు చోరీ కాగా, 1,140 రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లావ్యాప్తంగా కేకాట కేసులు 54 నమోదు కాగా 64వేల నగదు స్వాధీనం చేసుకుని 313 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల్లో 262 మంది మృత్యువాత…
ఈ ఏడాది జిల్లాలో 609 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 262 మంది మరణించగా, 544 మంది గాయపడ్డారు. గతేడాదితో పొలిచ్చతే కేవలం 1.9 శాతం మరణాల సంఖ్య పెరిగింది. అత్యధికంగా బైక్ ప్రమాదాలతోనే మరణాలు పెరిగాయి. 320 బైక్ యాక్సిడెంట్లు ఉండగా 151 మంది చనిపోయారు. ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది మరణించారు.
గంజాయి నిర్మూలనకు జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయి రవాణా అడ్డుకోవడంలో మంచి ఫలితాలు సాధించారు. 2024లో 38 కేసులు నమోదు చేసి 318 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 135 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
జిల్లావ్యాప్తంగా పోలీస్ స్టేషనల్లో ఫిర్యాదుల సంఖ్య తగ్గింది. 2023లో 12,436 ఫిర్యాదు రాగా, 7244 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. 2024లో 11,110 ఫిర్యాదులు రాగా 7,178 కేసులు ఎఫ్ఐఆర్ చేశారు. డయల్ 100కు 34,950 కాల్స్ రాగా, పోలీసులు సగటున 6 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమావేశంలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ రవి, జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రధాన ఘటనలు..