నార్కట్పల్లి మే 12 : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అధికారులు, నిర్వాహకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కొనుగోలు కేంద్రాలకు తెస్తే సకాలంలో కొనుగోళ్లు చేపట్టడంలేదు. కాంటాలు పెట్టకపోవడం, లారీలు రాకపోవడంతో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలో తిండీ తిప్పలు మాని పడిగాపులు పడాల్సి వస్తున్నది.
దీనికి తోడు వరుస క్రమంలో కాంటా పెడతామని సాకులు చెబుతూ డబ్బులు ఇచ్చే వారికే ముందు కాంటాలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఓవైపు కాంటాలు కాక మరోవైపు లారీలు రాక రోజుల తరబడి రైతన్న కొనుగోలు కేంద్రం వద్దనే పడిగాపులు కాస్తున్నారు. మా పంటను కొనండి సారూ.. అంటూ మూడు రోజులుగా లారీలు రాకపోవంతో మండలంలోని నక్కలపల్లి గ్రామానికి చెందిన రైతులు నడిరోడ్డుపై ధాన్యం పోసి దహనం చేస్తున్నారు.
సీజన్ వచ్చిందంటే చాలు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం ఆనవాయితీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆర్భాటంగా ప్రకటనలు చేయిస్తున్నది. ప్రజా ప్రతినిధులు కూడా ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామంటూ అదరగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఎక్కడా అవి అమలు కావడం లేదు.
కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో పండుగలా సాగిన వ్యవసాయం కాంగ్రెస్ పాలనలో దండగలా మారింది. ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ నిర్లక్ష్యానికి నిరసనగా మండలంలోని నక్కలపల్లి గ్రామ రైతులు తమ ధాన్యాన్ని మంగళవారం అగ్నికి ఆహుతి చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నదే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మిల్లర్ల చేతుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ కీలుబొమ్మగా మారింది. కాంగ్రెస్ త్వరలో బుద్ధి చెబుతాం. కేసీఆర్ సర్కార్లో రైతులకు ఎలాంటి ఇబ్బం ది లేదు. ప్రస్తుతం సరిగ్గా కాంటావేసి మిల్లర్లకు అందజేసినా మోసం జరుగుతోంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
-గుత్తా శేఖర్ రెడ్డి, రైతు, నక్కలపల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. వారం గడుస్తున్నా కొనుగోలు విషయంలో అధికారులు జా ప్యం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎవరికి చెప్పాలో ఏంటో అర్ద కావడం లేదు. వర్షం పడుతుందేమోనని భయంతో ఉన్నాం.
-కందాల కృష్ణారెడ్డి, రైతు, అమ్మనబోలు