పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కసరత్తు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన నల్లగొండ - వరంగల్ - ఖమ్మం జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక కోసం కసరత్తు మొదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం లేఖ రాయడంతో ఉప ఎన్నిక తెరపైకి వచ్చింది.
- ఫిబ్రవరి 6వరకు ఓటర్ల నమోదు
- ఏప్రిల్ 4 నాటికి తుది ఓటర్ల జాబితా
- జూన్ 8లోపు ఉప ఎన్నిక పూర్తికి
- ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు
- ఓటర్ల నమోదుపై రాజకీయ పార్టీల దృష్టి
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన నల్లగొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక కోసం కసరత్తు మొదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం లేఖ రాయడంతో ఉప ఎన్నిక తెరపైకి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం లేఖ సారాంశం ప్రకారం ఫిబ్రవరి 6వరకు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 4నాటికి తుది ఓటర్ల జాబితా ప్రకటించడంతోపాటు జూన్ 8 నాటికి ఉప ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు కీలకం కావడంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగేందుకు సన్నాహకాలు చేస్తున్నాయి.
నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో తన ఎమ్మెల్సీ పదవికి ఈ నెల 9న రాజీనామా చేశారు. దీంతో 2027 మార్చి 29వరకు మిగిలిన పదవీ కాలం పూర్తి చేయడం కోసం ఈ ఉప ఎన్నిక జరుగనుంది. ఈ క్రమంలో ఉప ఎన్నిక నిర్వహణపై దృష్టి సారించిన కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కు ఎన్నికల నిర్వహణపై ఆదేశాలిచ్చింది. తొలి దశలో ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టాలని, ఇందుకు సంబంధించి శనివారం ఓటరు నమోదుపై పబ్లిక్ నోటీసు జారీ చేయాలని సూచించింది. దీని ప్రకారం ఫిబ్రవరి 6 వరకు అర్హులైన పట్టభద్రుల నుంచి ఓటు కోసం దరఖాస్తులు స్వీకరించనుంది.
ఈ ఏడాది నవంబర్ 1నాటికి డిగ్రీ పూర్తయి మూడేండ్లు నిండిన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తులను పరిశీలించి ఫిబ్రవరి 21న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేస్తారు. ఈ జాబితాపై మార్చి 14 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటిని పరిష్కరించి ఏప్రిల్ 4న తుది ఓటర్ల జాబితా పూర్తి చేయాల్సి ఉన్నది. అనంతరం ఉప ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. జూన్ 8వరకు ఉప ఎన్నిక పూర్తి చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఉప ఎన్నికపై పబ్లిక్ నోటీసుతో ప్రధాన రాజకీయ పార్టీలు, బరిలో నిలువాలనుకుంటున్న అభ్యర్థులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.
కొత్త జిల్లాల ప్రకారం.. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, ఖమ్మం, కొత్తగూడెం భద్రాద్రి, వరంగల్ అర్బన్, రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, జనగాం జిల్లాలలోపాటు సిద్దిపేట జిల్లాలోని మూడు మండలాలతో ఈ నియోజకవర్గం విస్తరించి ఉన్నది. ఈ స్థానంలో 2007 నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎన్నికలు జరుగగా.. అన్నిసార్లు బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ సన్నద్ధమవుతున్నది. కాంగ్రెస్, బీజేపీ కూడా దృష్టి సారించనున్నాయి. 35 అసెంబ్లీ నియోజకవర్గాలతో ముడిపడి ఉన్న ఉప ఎన్నిక కావడంతో అందరూ ప్రతిష్టాత్మకంగానే తీసుకోవచ్చని భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో 5,05,565 మంది ఓటర్లు
2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 5,05,565 మంది ఓటర్లుగా నమోదయ్యారు. తుది జాబితా ప్రకటించే నాటికి 4,91,396 మంది ఓటర్లుగా నమోదు కాగా, అప్పట్లో నామినేషన్ల స్వీకరణ నాటికి అవకాశం కల్పించడంతో అదనంగా 14,169 మంది ఓటర్లు చేరారు. 2015 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 2,81,138 మంది ఓటర్లుగా ఉన్నారు. 2015తో పోలిస్తే 2021 మార్చి నాటికి 2,24,427 మంది అదనంగా ఓటర్లు చేరారు. ప్రస్తుత ఉప ఎన్నికల్లో ఎంత మంది ఓటర్లుగా నమోదవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. షెడ్యూల్ ప్రకారం ఆరేండ్లకోసారి ఎన్నిక జరుగుతుంది.
ఎన్నిక జరిగిన ప్రతిసారీ పట్టభద్రులంతా కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిందే. 2021 మార్చిలో మొత్తం ఓటర్లలో పురుషులు 3,32,634 మంది, మహిళా ఓటర్లు 1,72,864, ట్రాన్స్జెండర్లు 67 మంది ఉన్నారు. అప్పట్లో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 90,826 మంది, ఖమ్మంలో 87,172, వరంగల్ అర్బన్ జిల్లాలో 66,379 మంది ఉండగా.. అతి తక్కువగా ములుగు జిల్లాలో 10,323 మంది ఓటర్లు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలోని మూడు మండలాలు ఇందులో ఉండగా 3,584 మంది ఇక్కడ ఓటర్లుగా నమోదయ్యారు. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 74శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 5,05,565 మంది ఓటర్లకు గాను 3,74,117 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2015 ఎన్నికల్లో 54.62 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

