నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గాన్ని సీపీఐకే కేటాయించాలని, లేదంటే కాంగ్రెస్‌తో స్నేహపూర్వక పోటీకి సిద్ధమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ మేరకు సీపీఐ నల్లగొండ జిల్లా కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీపీఐ నల్లగొండ జిల్లా కార్యాలయంలో మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్య అతిథిగా ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. ఇందులో ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు, పరిణామాలపై చరించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా బలమైన పార్టీ క్యాడర్, గతంలో నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన సీపీఐకి మునుగోడును కేటాయించాలని జిల్లా కౌన్సిల్ సభ్యులు కోరారు. లేకుంటే తమకు స్నేహపూర్వక పోటీకి అనుమతించాలని కోరుతూ రాష్ట్ర, జాతీయ కౌన్సిళ్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపాలని నిర్ణయించారు. జిల్లా కౌన్సిల్ సభ్యుల్లో మెజార్టీ సభ్యులు జిల్లాలో బలమైన ఉద్యమ చరిత్ర ఉన్న మునుగోడు స్థానాన్ని సీపీఐకి కేటాయించాలని డిమాండ్ చేశారు. 2018లో చివరి క్షణంలో సీపీఐకి కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ సీటు తీసుకున్నదని గుర్తు చేశారు. మళ్లీ పొత్తుల పేరుతో మరోసారి మునుగోడులో సీపీఐకి తీవ్ర అన్యాయం చేయడం తగదన్నారు. గతంలో కాంగ్రెస్‌కు ఇచ్చారు.. కాబట్టి ఈసారి సీపీఐకి సీటు కేటాయించాలన్నారు. లేదంటే స్నేహపూర్వక పోటీకి సిద్ధమని జిల్లా నేతలు స్పష్టం చేశారు. అనంతరం పల్లా వెంకట్‌రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, జిల్లా సహాయ కార్యదర్శులు దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్, ఇతర జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.