నీలగిరి, జనవరి 24 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి చక్కటి స్పందన వస్తుంది. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగో రోజు 18,881మందికి పరీక్షలు చేయగా ఇప్పటి వరకు 80,617మందికి పరీక్షలు చేశారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 38,516 మందికి కంటి వెలుగు పరీక్షలు చేయగా మంగళవారం 8,979 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో పురుషులు 4,495 మంది, స్త్రీలు 4,484 ఉన్నారు.
సూర్యాపేట జిల్లాలో..
సూర్యాపేట : జిల్లా వ్యాప్తంగా 51 కంటి వెలుగు కేంద్రాల్లో 6,323 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 3,109 మంది పురుషులు, 3,214 మంది స్త్రీలు ఉన్నారు. ఎలాంటి కంటి సమస్యలు లేని వారు 2,016 మంది ఉండగా, 1,897 మందికి రీడింగ్ గ్లాస్లు అందించారు. మరో 874 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ రెఫర్ చేశారు. 3,886 మందికి కంటి సమస్యలకు సంబంధించి మెడిసిన్ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 25,249 మందికి కంటి పరీక్షలు చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
భువనగిరి : జిల్లా వ్యాప్తంగా 3,579 మందికి పరీక్షలు చేపట్టగా 857మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 16,852 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో జర్నలిస్టులకు, ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన కంటివెలుగు శిబిరంలో 116 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా ఇందులో 21మంది జర్నలిస్టులు పరీక్షలు చేయించుకున్నారు. 29మందికి రీడింగ్ గ్లాసులు, 35మందికి ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలు అందజేశారు. కార్యక్రమాల్లో మెడికల్ ఆఫీసర్లు, క్యాంపు ఆఫీసర్లు, కో ఆర్డినేటర్లు, ఆఫ్తమాలజిస్టులు, ఏఎన్ఎంలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అద్దాలు పెట్టుకుంటే తేటగా కనిపిస్తున్నది
నాకు కొన్ని రోజుల నుంచి కండ్లు మస్కగా కనిపించేవి. అధికారులు మా గ్రామ పంచాయతీ ఆఫీస్లో కంటివెలుగు శిబిరం పెట్టిండ్రని చెప్పిండ్రు. అందుకే ఇక్కడికి వచ్చిన. డాక్టర్లు పరీక్షలు చేసి ఉచితంగా కండ్ల అద్దాలు ఇచ్చిండ్రు. అద్దాలు పెట్టుకున్నంక కండ్లు తేటగా కన్పిస్తున్న్తయి. గవర్నమెంట్ పరీక్షలు చేసి అద్దాలు ఇయ్యడం సంతోషంగా ఉంది. ఆస్పత్రికి వెళ్లలేని మా లాంటి పేదోళ్లకు పరీక్షలు చేయిస్తున్న కేఈసార్ సార్కు దండాలు.
-సైదయ్య, కొండభీమనపల్లి, దేవరకొండ రూరల్
పేదలకు వరం కంటి వెలుగు
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం పేదలకు వరం లాంటింది. గ్రామాల్లో ఎంతో మంది మహిళలు చూపు సరిగా లేక, దవాఖానలకు పోలేక ఇబ్బంది పడుతుండ్రు. ఈ సమయంలో మా ఊర్లోనే కంటి వెలుగు పెట్టి పరీక్షలు ఉచితంగా చేసి కండ్లద్దాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సార్ పుణ్యమాని పేదోళ్ల జీవితాల్లో వెలుగులు నిండుతున్నయి. కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
-కొమ్మగాని అచ్చమ్మ, పాలకవీడు
పేదలకు అండగా ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేస్తున్న ప్రభుత్వ నిర్ణయం ఎంత గొప్పది. గతంలో నిర్వహించిన కంటివెలుగులో కంటి పరీక్షలు చేయించుకున్నా. ప్రస్తుతం రెండో విడుతలోనూ పరీక్షలు చేయించుకుంటే మళ్లీ అద్దాలు ఇచ్చిండ్రు. అంతేకాకుండా మందులు కూడా ఉచితంగా అందజేసిండ్రు. ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ ప్రజాణీకం రుణపడి ఉంటుంది.
– బాలమణి, ఆలేరు
కంటి వెలుగు బృహత్తర కార్యక్రమం
నాపేరు కాశయ్య. వయస్సు 65 సంవత్సరాలు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కంటివెలుగు ఒక బృహత్తర కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం నాకు తెలిసి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఎక్కడా లేదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల బాధలు తెలిసిన వ్యక్తి. అందుకే ముందుచూపుతో ఇలాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు. నాకు ఎప్పటి నుంచో రెండు కండ్లు మసకగా కనిపిస్తుండేవి. దాంతో కంటివెలుగు సెంటర్లో పరీక్ష చేయించుకున్నా. కుడి కన్నుకు ఒకలా, ఎడమ కన్నుకు మరోలా దృష్టిలోపం ఉందని ఇక్కడి వైద్యులు తెలిపారు. తనకు సరిపడే అద్దాలకు ఆర్డర్ పెడుతామన్నారు. ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వం నాకు పరీక్షలు చేయించడం అభినందనీయం.
-కాశయ్య, గాంధీనగర్, మిర్యాలగూడ టౌన్