సూర్యాపేటకు నిధుల వరద పారుతున్నది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలతో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరానికి సరిపడా నిధులు విడుదల చేస్తున్నది. తాజాగా మహిళా పాలిటెక్నిక్ కళాశాలతోపాటు హాస్టల్ భవనాల నిర్మాణం కోసం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు జీఓ జారీ అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల సూర్యాపేట పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ అమలయ్యాయి. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చొరవతో పట్టణ రూపురేఖలు మారిపోతున్నాయి. తొమ్మిదేండ్లలో ఎవరూ చేయని విధంగా జరిగిన అభివృద్ధి చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
– సూర్యాపేట, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : నేడు సూర్యాపేట పట్టణంలో ఎటు చూసినా వెలుగు జిలుగులే. కార్పొరేట్‌ను తలదన్నేలా భారీ ప్రభుత్వ భవంతులు, మూసీ మురుగు నీరు మాయమై స్వచ్ఛమైన మిషన్ భగీరథ జలాలు, అహ్లాదాన్ని పంచే పార్కులు, మినీ ట్యాంక్‌బండ్, బోటింగ్లతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో మహాప్రస్థానం, సకల సదుపాయాలతో వైకుంఠ ధామాలు, విశాలమైన రోడ్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, వాటర్ ఫౌంటైన్లు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఇక చిన్న వానలకే చెరువులను తలపించిన విద్యానగర్, 60 ఫీట్ల రోడ్డు, చర్చి కాంపౌండ్ల ముంపు తిప్పలు నాళా నిర్మాణంతో తొలగిపోయాయి. మొత్తంమీద తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సూర్యాపేట అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. సూర్యాపేటకు ముఖ్యమంత్రి వచ్చినా ఇతర ఏ శాఖ మంత్రి వచ్చినా జిల్లా కేంద్రానికి కావాల్సిన వాటితో పాటు జిల్లాలో ఇంకా మిగిలి ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తాజాగా రూ. 25 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది.
ప్రతి ఒక్క హామీ అమలు
సీఎం ఇచ్చిన హామీల్లో 475 పంచాయతీలకు రూ.47.50 కోట్లు విడుదల చేస్తూ జీఓ విడుదల కాగా అనంతరం వరుసగా రూ.25 కోట్లతో భానుపురి కళాభారతితో పాటు రూ.50 కోట్లతో స్టేడియం, రూ.25 కోట్లతో స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణం, అనంతరం ఆర్అండ్బీ గెస్ట్ హౌజ్ నిర్మాణానికి రూ.10 కోట్లు విడుదలయ్యాయి. తాజాగా సీఎం మరో హామీయైన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు రూ.25 కోట్లు విడుదలయ్యాయి. అడిగిన వెంటనే హామీ ఇవ్వడమే కాకుండా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుండడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల పక్షాన మంత్రి జగదీశ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.