విద్యుత్ శాఖలో అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన పనుల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంప్రూవ్మెంట్ బడ్జెట్ నేటికీ మంజూరు కాలేదు. దీంతో మరమ్మతులు చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కనీసం అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు ఓ విద్యుత్ స్తంభం వేయాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ దాదాపు రూ.60 కోట్లతో ఇండెంట్ పంపించి రెండు నెలలు గడిచినా నేటికీ అతీగతీ లేకుండా పోయింది. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి లేదని ఆ శాఖ ద్వారా తెలిసింది.
సూర్యాపేట, మే 9 (నమస్తే తెలంగాణ): పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో వెలుగులు వెలిగిన విద్యుత్ శాఖ నేడు చీకట్లు అలుముకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సరఫరా ఓ పీడకలగా ఉండేది. కరెంటు కోసం అనేక కష్టాలు పడాల్సివచ్చేది. తెలంగాణ ఏర్పాటు అనంతరం అభివృద్ధికి నీళ్లు, విద్యుత్ మూలంగా భావించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రెండు రంగాలకు అధిక మొత్తంలో నిధులు కేటాయించడంతో దేశంలోనే తెలంగాణ జీడీపీ రికార్డు స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే.
ప్రధానంగా విద్యుత్ విషయానికి వస్తే రైతులతో పాటు అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసింది. దీని కోసం రూ. వేల కోట్లు వెచ్చించి అవసరమైన విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు తదితర కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసింది. ఎన్నికల సమయంలో హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నేటికీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదు. ఇదే క్రమంలో కోతలతో వ్యవసాయం, గృహావసరాలకు నిరంతర విద్యుత్‌కు మంగళం పాడింది.
ప్రతి ఆర్థిక సంవత్సరం ఆయా జిల్లాలకు విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఇంప్రూవ్మెంట్ నిధులు విడుదల చేస్తారు. కానీ మార్చితో ఆర్థిక సంవత్సరం ముగిసి రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. సాధారణంగా ప్రతి ఏడాది మార్చి నెలాఖరులోనే ఆయా జిల్లాల నుంచి ఇంప్రూవ్మెంట్ బడ్జెట్ కోసం ఎస్పీడీసీఎల్కు ఇండెంట్ పంపించడం, ఆ తర్వాత అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళ్తుంది. ఈ నిధులను అవసరానికి అనుగుణంగా విడతల వారీగా విడుదల చేస్తారు. వీటితో అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, మిడిల్ పోల్స్, డ్యామేజీ పోల్స్, ఇంటర్ లింక్ లైన్స్ తదితర లోఓల్టేజీ నివారణకు కావాల్సిన చర్యలు చేపడుతారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీటి కోసం ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి వారంలోనే బడ్జెట్ వచ్చేది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి దాదాపు రూ.60 నుంచి 65 కోట్లతో ఇండెంట్ పెట్టినట్టు సమాచారం. సూర్యాపేటలో రూ.15 నుంచి రూ.20 కోట్లు, నల్లగొండలో రూ.35 నుంచి రూ.40 కోట్లు ఉండగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.10 నుంచి రూ.12 కోట్లు అవసరమని ఇండెంట్ పంపగా.. ఇప్పటి వరకు ఎలాంటి నిధులు విడుదల కాకపోవడం గమనార్హం.
దీంతో ఎక్కడైనా అత్యవసర పనులు ఉంటే ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొన్నింటిని కాంట్రాక్టర్లను రిక్వెస్టు చేయించడం.. మరి కొన్నింటిని వాయిదా వేయడం చేస్తున్నారు. ప్రస్తుతం మూడు జిల్లాల్లో కలిపి దాదాపు 250కి పైనే లోఓల్టేజీ సమస్యలతో అదనపు ట్రాన్స్ఫార్మర్లు బిగించాల్సి ఉండగా.. అవి పెండింగ్‌లో ఉన్న ట్లు తెలుస్తున్నది. అలాగే చాలా చోట్ల విద్యుత్ సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం నిధులు విడుదల చేయాలని స్థానికులు కోరుతున్నారు.