యాదగిరిగుట్ట, డిసెంబర్ 26 : దైవ దర్శనానికి వచ్చే వీవీఐపీల కోసం యాదగిరిగుట్ట కొండపైన నిర్మించిన అతిథి గృహాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లా మారాయని ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ నరహరి ఆరోపించారు. గురువారం వారు స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వీవీఐపీ అతిథి గృహంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తన అనుచరులతో కలిసి రాత్రి బస చేయడం ఆలయ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమన్నారు. ఆలయ ఈఓ భాస్కర్‌రావు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని, అయన తీరు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని మండి పడ్డారు. స్వాతి నక్షత్రం సందర్భంగా చేసే గిరిప్రదక్షిణ వందల ఏండ్లుగా ఉదయం 3 గంటల్లోపే వైకుంఠ ద్వారం వద్ద నుంచి చేస్తారన్నారు. కానీ ఈఓ భాస్కర్‌రావు మాత్రం ఇందుకు భిన్నంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వచ్చే వరకు గిరిప్రదక్షిణ ప్రారంభించడం లేదని విమర్శించారు.
స్వామివారి సేవలను ప్రజాప్రతినిధులు వచ్చి మార్చడమేంటని మండిపడ్డారు. ఈఓ భాస్కర్‌రావు ఆలయ నియమాలను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారి గర్భాలయ దర్శనానికి ప్రతి భక్తుడు సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్లాల్సి ఉండగా.. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అతడి అనుచరులు ఇందుకు విరుద్ధంగా ప్యాంట్లు, సెల్ ఫోన్లతో గర్భాలయ దర్శనానికి వెళ్లారని ఆరోపించారు. ఇదంతా ఈఓ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎంపీ చామల వివేరా హోటల్లో బస చేశామని మాట మారుస్తున్నారని మండి పడ్డారు. ఒకవేళ ఎంపీ వీవీఐపీ గెస్ట్ హౌస్‌లో బస చేయలేదన్నది నిజమైతే సీసీ కెమెరాలను పరిశీలిస్తే స్పష్టమవుతుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ నాయకులు ఆరే శ్రీధర్, పేరబోయిన సత్యనారాయణ, ఆవుల సాయి, షేక్ దావూద్, ఎండీ యాకూబ్ పాల్గొన్నారు.