సూర్యాపేట, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : తిరుమలగిరిలో ప్రభుత్వం ఇటీవల కొత్తగా జూనియర్ కళాశాలను మంజూరు చేసింది. ఈ ఏడాది నుంచే తరగతులను ప్రారంభించింది. కానీ విద్యార్థులు లేక అభాసుపాలయ్యే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ నేతలు తాము ఏదో సాధించామన్నట్లుగా హడావుడిగా కళాశాల మంజూరు చేసి చేతులు దులుపుకొన్నారు. కానీ ఇక్కడ విద్యార్థుల సంఖ్య, వసతులను పట్టించుకోలేదు. దాంతో సరిపడా అడ్మిషన్లు లేకపోవడంతో అధ్యాపకులు, సిబ్బందిని కేటాయించలేని దుస్థితి ఏర్పడింది. అన్ని గ్రూపులకు కలిపి 32 అడ్మిషన్లు రాగా వచ్చే విద్యార్థులు కూడా 12 మందికి మించి హాజరుకావడం లేదు. ప్రస్తుతం సమీప కళాశాల అధ్యాపకులను బోధించేందుకు సర్దుబాటు చేయడంతో రెండువైపులా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఎక్కడైనా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలంటే అడ్మిషన్లు ఎన్ని అవుతాయో అలోచన చేసి అంచనాలు వేస్తారు. కానీ తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎలా మంజూరు చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే జిల్లాలో సూర్యాపేట, తుంగతుర్తి, నెమ్మికల్, నడిగూడెం, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఒక్క సూర్యాపేట మినహా మిగిలిన కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య అంతంతమాత్రమే. కానీ తిరుమలగిరిలో కొత్త కళాశాల ఎందుకనే ప్రశ్న ఉదయిస్తున్నది. తిరుమలగిరిలో ఇప్పటికే మోడల్, కస్తూర్బాతోపాటు ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల కూడా ఉంది. పేద, మధ్య తరగతి విద్యార్థులు పది పాస్ అయిన తర్వాత హాస్టల్స్ సౌకర్యం ఉన్న మోడల్, కస్తూర్బాలోకి వెళ్తున్నారు. ఫీజులు కట్టే స్తోమత ఉన్న వారు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుతున్నారు. ఈ క్రమంలో తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలకు విద్యార్థులు ఎక్కడి నుంచి రావాలనేది సమస్య ఉత్పన్నమవుతున్నది.
కళాశాల ఏర్పాటు చేయాలంటే ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఆఫీస్ స్టాఫ్ అవసరం ఉంటుంది. కానీ తిరుమలగిరికి కళాశాల మంజూరు చేసి కనీసం ఆఫీస్ స్టాఫ్ కూడా ఏర్పాటు చేయలేదు. నాలుగు గ్రూపులు, రెండు మీడియమ్లకు కలిపి ప్రస్తుతం తిరుమలగిరి ఉన్నత పాఠశాలలో జూనియర్ కళాశాలకు మూడు గదులను కేటాయించారు. ప్రతి నిత్యం 10 నుంచి 12 లోపు మంది విద్యార్థులే హాజరవుతున్నారు. బోధన చేసేందుకు తుంగతుర్తి, నెమ్మికల్, సూర్యాపేట నుంచి అధ్యాపకులను రెండు, మూడు రోజులకు ఒక సారి వచ్చి వెళ్లేలా సర్దుబాటు చేస్తున్నారు. దాంతో రెండు చోట్ల విద్యార్థులు నష్టపోయే పరిస్థితి దాపురించింది. కనీసం గెస్ట్ ఫ్యాకల్టీని కూడా ఏర్పాటు చేయడం లేదు.
తిరుమలగిరి జూనియర్ కళాశాలలో ఇప్పటివరకు 32కు మించి అడ్మిషన్లు కాలేదు. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ నాలుగు కోర్సుల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియం మంజూరయ్యాయి. సైన్స్ గ్రూపులకు 30, ఆర్ట్స్ గ్రూపులకు 40 మంది చొప్పున అడ్మిషన్లు తీసుకోవాల్సి ఉంది. మొత్తం 240 అడ్మిషన్లకుగానూ కేవలం 32 మాత్రమే అయ్యాయి. అందులో కూడా కళాశాలను ఎలాగైనా నిలబెట్టాలని కొంతమంది ప్రైవేట్ కళాశాలలపై వత్తిడి చేసి అడ్మిషన్లు తీసుకొస్తుండగా, ఎప్పుడో పది పాస్ అయి ఇంటి వద్ద ఉన్నవారిని కూడా తీసుకొచ్చి అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తిరుమలగిరి మోడల్ స్కూల్, కస్తూర్బా విద్యాలయాన్ని ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేయించారు. అలాగే నాడు విద్యార్థి సంఘాలు తిరుమలగిరిలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని నాటి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు విజ్ఞప్తి చేసినా తిరస్కరించారు. ‘ఇప్పటికే ఇక్కడ రెండు కళాశాలలు ఏర్పాటు చేశాం.. పక్కనే ఉన్న తుంగతుర్తిలో ఇంటర్ కళాశాల ఉన్నది. ఈ ప్రాంతంలో కళాశాల ఏర్పాటుకు సరిపడా విద్యార్థులు ఉండరు’ అని విద్యార్థి సంఘాలకు విడమర్చి చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో సాధించినట్లుగా అవకాశం లేని చోట జూనియర్ కళాశాల ఏర్పాటు చేసింది.