మిర్యాలగూడ, మే 18 : రాష్ట్రంలో రైతుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం త్రిపురారం మండలం కంపసాగర్ గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మిర్యాలగూడ మండలంలోని జప్తివీరప్పగూడెం గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రైతుల కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని మంచి దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులకు సాగునీటి సమర్థ వినియోగం, తక్కువ యూరియా వాడకంపై అవగాహన కల్పించారు. అలాగే విత్తనాల లభ్యత, పంట కోతలు, విత్తనాల కొనుగోలు సమయంలో రశీదులను భద్రపరచడం, సమగ్ర పురుగు, తెగుళ్ల మందుల వినియోగం, చెట్లు నాటడం వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం హెడ్ డాక్టర్ లింగయ్య, కేవీకే శాస్త్రవేత్తలు చంద్రశేఖర్, రాములమ్మ, జిల్లా ఉద్యాన అధికారి అనంతరెడ్డి, నరసింహా, ప్రధానోపాధ్యాయులు అనంతరెడ్డి, మత్స్యశాఖ అధికారి కిశోర్, కృష్ణనాయక్, శ్రీనివాస్‌రావు, చలపతిరావు, జిందా, రాంబాబు, నరసింహా పాల్గొన్నారు.