సూర్యాపేట, అక్టోబర్ 31 : తేమ, తాలుతో సంబంధం లేకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పలు ఐకేపీ కేంద్రాల్లో ఆయన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొంథా తుపాన్ రైతులను నిండా ముంచిందన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షం కారణంగా నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు.
తేమ, తాలు పేరుతో కొనుగోలు చేయకపోవడంతో పలు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతులు నష్టపోయారన్నారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ, తాలుకు లింకు పెడుతూ ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి వెంటనే రైతులకు పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.