నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ)/చందంపేట : ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సాగు నీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాబోయే మూడేండ్లల్లోనే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఎల్ఎల్బీసీ టన్నెల్ పనులపై ప్రత్యేక సమీక్ష చేస్తూ నెలనెలా నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. 2027 సెప్టెంబర్ నాటికి సొరంగ మార్గాన్ని పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు.
నకలగండి, ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులకు ప్రాధాన్యతా క్రమంలో నిధులు విడుదల చేస్తామని చెప్పారు. శుక్రవారం ఎల్ఎల్బీసీ టన్నెల్‌ను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో బట్టి విక్రమార్క, మండలి చైర్మన్ గుత్తా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ ఉన్నతాధికారులు పరిశీలించారు. టన్నెల్లో ప్రయాణించి పనుల పురోగతిపై ఆరా తీశారు.
అనంతరం మన్నెవారిపల్లి క్యాంపులో సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్, ట్రాన్స్‌కో రాష్ట్ర ఉన్నతాధికారులతోపాటు ఉమ్మడి జిల్లాల అధికారులు హాజరయ్యారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వం వహిస్తూ ప్రాజెక్టుల వారీగా అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు. ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, ప్రాధాన్యతలను ఇరిగేషన్ సీఈ అజయ్‌కుమార్ వివరించారు. మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులను రెండు వైపులా వచ్చే ఏడాది ఆరంభం నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. నెలకు 400 మీటర్ల తవ్వకం చేస్తే సుమారు రూ.30 కోట్లు అవుసరమవుతాయని ఆర్థిక శాఖ మంత్రి భట్టిని కోరగా, నెలానెలా నిధులను విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. వచ్చే మూడేండ్లల్లో ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు.
నక్కలగండి, పెండ్లిపాకల రిజర్వాయర్లల్లో పెండింగ్ పనులు, భూ సేకరణ సమస్య, అటవీ శాఖ అనుమతులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. డిండి ఎత్తిపోతల పథకంపై సమీక్షిస్తూ ఎదుళ్ల నుంచే నీటిని తీసుకుంటామని, ప్రాధాన్యత ప్రాజెక్టు కింద డిండి ఎత్తిపోతలను పూర్తి చేస్తామని ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న ఉదయసముద్రం, పిలాయిపల్లి, ధర్మారెడ్డికాల్వ, బునాదిగాని కాల్వకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, త్వరలో ఆమోదం తెలిపి పనులు చేపడుతామని వెల్లడించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ ఏఎమ్మార్పీ నాలుగో మోటర్‌ను నాలుగు రోజుల్లో నడుపాలని సీఈని ఆదేశించారు. ప్రధాన కాల్వ లైనింగ్ పనుల కోసం రూ.442 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపాలని ఆర్థిక శాఖ మంత్రి భట్టిని కోరారు. ఉదయసముద్రం ఎత్తిపోతల పథకంలో భూ సేకరణతోపాటు పనుల నిర్వహణ కోసం రూ.300 కోట్లు కావాలని విజ్ఞప్తి చేశారు. సబ్ స్టేషన్లు, ఇతర విద్యుత్ అవసరాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఇచ్చే ప్రతిపాదనలను పరిశీలించి విద్యుత్ శాఖ అధికారులు వెంటనే అనుమతులు ఇవ్వాలని భట్టి సూచించారు.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ నక్కలగండి, సింగరాజుపల్లి రిజర్వాయర్లకు సెల్ప్ క్యాచ్మెంట్ ఏరియా ఉందని, పెండింగ్ పనులు పూర్తి చేసి నీళ్లు నిల్వ చేస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. టన్నెల్ పూర్తయ్యే నాటికి వాటి ద్వారా సాగునీరు అందించవచ్చన్నారు. ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ లైనింగ్‌తోపాటు కాల్వ విస్తరణను 2400 క్యూసెక్కుల సామర్ధ్యంతో చేపడితేనే టన్నెల్ వాటర్‌ను పూర్తి స్థాయిలో వాడుకోవచ్చన్నారు.
ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు వేము ల వీరేశం, బాలూనాయక్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, జయవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేల్, డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ తమ నియోజకవర్గాల్లోని ప్రాజెక్టుల పనులపై వివరించారు. ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి, నిధుల కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు. చందంపేట మండలంలోని నక్కలగండి తండాకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని ఎమ్మెల్యే బాలూనాయక్ కోరారు. నక్కలగండి ముంపు ప్రాంతాలకు ఇచ్చిన విధంగానే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ముంపునకు గురవుతున్న మన్నెవారిపల్లి సమీప ప్రాంతాల్లో ఇండ్లకు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పెండ్లిపాకల రిజర్వాయర్ పరిధిలో ముంపునకు గురవుతున్న గుడితండా, హర్యాతండాకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించాలన్నారు. రివ్యూ మీటింగ్‌లో ఫైనాన్స్ విభాగం స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్‌కుమార్, సీఈ అజయ్‌కుమార్, అంతకుముందు చీఫ్ ఇంజనీర్ వి. అజయ్ కుమార్, ట్రాన్స్‌కో సీఎండీ ముషారఫ్, నల్లగొండ కలెక్టర్ నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ కలెక్టర్ మాదావత్ సంతోశ్, ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొన్నారు.
నెల్లికల్లు లిఫ్ట్‌ను కుదించొద్దు : ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ
సాగర్ నియోజకవర్గంలోని నెల్లికల్లు ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ సర్కార్ 20వేల ఎకరాల ఆయకట్టుతో డిజైన్ చేసిందని, ఇప్పుడు దాన్ని కుదించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసిందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. 75 శాతానికిపైగా గిరిజన ప్రాంతం సాగర్‌కు చెంతలో ఉన్నా సాగునీటికి నోచలేదన్నారు. అందువల్ల గత డిజైన్ ప్రకారమే ఆయకట్టుకు నీరందేలా ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. జిల్లాలోని పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటికీ అవసరమైన నిధులు విడుదల చేస్తూ నిర్ధిష్ట కాలపరిమితితో పూర్తి చేయాలన్నారు.