రైతు గతిని మార్చిన బృహత్తర పథకం బోర్లు, బావుల దగ్గర తప్పిన పడిగాపులుఉమ్మడి జిల్లాలో 4.75.584 వ్యవసాయ కనెక్షన్లు ఏటా రూ.15వేల కోట్లకుపైగా రైతుల కోసం చెల్లిస్తున్న ప్రభుత్వం ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న రైతాంగం కడగండ్లను గట్టెక్కించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
స్వతహాగా రైతు అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పురుడు పోసుకున్న వ్యవసాయ పథకాలు ఈ పరిస్థితులను సమూలంగా మార్చాయి. కీలకమైన 24 గంటల ఉచిత విద్యుత్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4.75.584 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా, రైతుకు రూపాయి భారం కూడా లేకుండా ప్రభుత్వమే ఏటా వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తున్నది. ఇయ్యాల చూస్తే.. చుట్టూ సాగునీటి వనరులు, పుష్కలంగా భూగర్భ జలాలు, వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌తో వ్యవసాయం సస్యశ్యామలంగా సాగుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వరి సాగులో రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా ఉంటూ దేశానికే అన్నం పెడుతున్నది. 24 గంటల ఉచిత విద్యుత్ ప్రారంభించి నేటితో ఐదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.
– నల్లగొండ సిటీ డిసెంబర్ 31
వ్యవసాయం ప్రధానాధారమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు ఎవుసమంటే యాతనగా ఉండేది. కనిపించని సాగునీటి వనరులు, ఎండిన చెరువులు, అడుగంటిన భూగర్భజలాలు, ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని కరెంటుతో నెర్రెలు వారిన పంట చేలు.. వెరసి ఎద్దు ఏడ్చిన ఎవుసంలా సాగేది. పంట చేతికి వచ్చేదాకా రైతుకు నమ్మకం ఉండేది కాదు. ఆఖరికి అప్పులు కుప్పై అన్నదాతను
బలితీసుకునేవి.
రైతుల బతుకులు మారినయంటే కేసీఆర్ పుణ్యమే..
తాతల నుంచి మాకు 14 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. బోర్ల మీద ఆధారపడే పంటలు వేసేది. నీళ్లు లేక పంటలు ఎండుతుంటే, అప్పులు తెచ్చి మళ్లీ బోర్లేసినం. అయినా ఆగి ఆగి పోసే బోర్లు, వచ్చిపోయే కరెంటుతో నష్టపోయినం. అప్పుల బాధకు భూమిని అమ్ముకుంటూ వచ్చినం. చివరకు ఐదెకరాలు మిగిలింది. ఇదే ఇప్పుడు మా కుటుంబానికి ఆధారం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా బతుకులో మార్పు వచ్చింది. పానగల్ చెరువును ఎప్పటికప్పుడు నింపుతుండడంతోని పుష్కలంగా నీళ్లుంటున్నయి.
మా ఊరి చెరువు పూడిక తీసి, కట్ట గట్టిగ చేసినరు. దాంతోని ఎండ కాలంలో గూడ బోర్లలో నీళ్లకు కొదువ లేదు. నాణ్యమైన కరెంటు ఇస్తుండడంతో పొద్దుందాక బోర్లు పోస్తున్నయ్. మోటర్ల కాడ పడిగాపులు గాసే బాధ తప్పింది. ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు పైసలతో పెట్టుబడి రంది కూడా లేకుండ పోయింది. కేసీఆర్ పుణ్యాన రైతుల బతుకులు మారినయ్.
– డోకూరి శేఖర్‌రెడ్డి, చిన్నసూరారం గ్రామం, నల్లగొండ
నల్లగొండ సిటీ, డిసెంబర్ 31 : తెలంగాణ రాష్ట్రమొస్తే కారుచీకట్లు కమ్ముకుంటాయన్న సీమాంధ్రుల ఆరోపణలను బీఆర్ఎస్ ప్రభుత్వం తిప్పికొట్టింది. అనతికాలంలోనే మిగులు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి మహత్తర కార్యక్రమానికి చుట్టి నేటికి సరిగ్గా నాలుగేండ్లు పూర్తయ్యింది. ఉమ్మడి జిల్లాలో 4.68లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా వాటికి ఉచితంగా విద్యుత్నందిస్తూ ఏడాదికి రూ.15వేల కోట్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4,68,109 విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లాలో 2,17,660, సూర్యాపేట జిల్లాలో 1,40,549, యాదాద్రిభువనగిరి జిల్లాలో 1,09,900కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికి ఎక్కడా ఆటంకాలు లేకుండా ప్రభుత్వం నిరంతరం 24గంటల కరెంట్ ఉచితంగా అందిస్తున్నది.
పెరిగిన వ్యవసాయం
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ సరఫరా పెద్ద సమస్యగా ఉండేది. నాడు నీరున్నా వాడుకోలేని దుస్థితిలో కరెంట్ ఉత్పతి, కొనుగోళ్ల సరఫరాపై పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఫలితంగా వ్యవసాయానికి 6నుంచి 8గంటలు మించి విద్యుత్ రాకపోయేది. దీంతో వ్యవసాయం చేయలేక భూములు బీడ్లుగా మారేవి. కరెంట్ వచ్చిన కొద్దిపాటి సమయంలో లోఓల్టేజీ కారణంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు కరెంట్ రంది తీరింది. ప్రభుత్వం కరెంట్ సమస్య దృష్టి సారించి తీర్చడంతో పాటు, వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరా వంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటలకు మరమ్మతులు చేయించి నీటి నిల్వ సామర్థ్యం పెంచింది. దీంతో సేద్యం పెరిగి ఎటుచూసిన పంట పొలాలు కనువిందు చేస్తున్నాయి.
విద్యుత్ భారం మోస్తున్న ప్రభుత్వం
వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ఏడాదికి రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులకు రూపాయి ఖర్చు లేకుండా ఉచిత విద్యుత్ అందిస్తున్నది. దీంతో పాటు పల్లె, పట్టణ ప్రగతి కింద అదనపు ట్రాన్స్ఫారాలు, లైన్లు, స్తంభాల ఏర్పాటుతో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ అందిచడంతో సాగు పెరిగింది. దీంతో గతంలో కంటే అదనంగా 2లక్షల పైచిలుకు విద్యుత్ కనెక్షన్లు పెరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు కరెంట్ కోసం నిరీక్షణలు తప్పాయి.
రాష్ట్రంలో అత్యధిక వినియోగం మన దగ్గరే
రాష్ట్రంలో అత్యధిక బోర్లు ఉన్న జిల్లా మనదే కావడంతో ఇక్కడే అత్యధిక వినియోగం జరుగుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.68లక్షల వ్యవసాయం కనెక్షన్లు ఉన్నాయి. గతంలో వేసవి వస్తే కరెంట్ సమస్యలు తీవ్రంగా ఉండేవి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మచ్చుకు సైతం కరెంట్ సమస్యలు కానరావట్లేదు. పరిశ్రమలు, వ్యవసాయానికి కొరత లేకుండా విద్యుత్ సరఫరా అవుతున్నది.
ఉచిత విద్యుత్‌తో రైతుకు మేలు
ప్రభుత్వం 24గంటల ఉచిత విద్యుత్ అందించడంతో పుష్కలంగా పంటలు పండించుకుంటున్నాం. సీఎం కేసీఆర్ అధికారం చేపట్టాక ఉచితంగా కరెంట్ ఇవ్వడంతో నేను ఐదెకరాల్లో సాగు చేస్తున్నా. ఉచిత విద్యుత్ ఆర్థికంగా నాకు తోడ్పడింది. ఇలాంటి సీఎంను ఎప్పుడూ మర్చిపోం.
– బూడిద రమేశ్‌యాదవ్, రైతు, కొండమల్లేపల్లి
24 గంటల విద్యుత్ చారిత్రాత్మకం
దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమానికి 24గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దే. దశాబ్దాల పాటు నిరంతరం కరెంటు కోతలతో, అనేక విద్యుత్ సమస్యలతో రైతాంగం పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు పంటలు కాపాడుకునేందుకు పొలం దగ్గరే ఉంటూ రేయనక, పగలనక అరిగోసపడ్డాం. నాటి కష్టాలను తలచుకుంటే చాలా భాధగా ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం పంటలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నది. దండగనుకున్న వ్యవసాయాన్ని పండగలా మారుస్తున్న సీఎం కేసీఆర్ సారుకు నాతో పాటు రాష్ట్రంలోని రైతులంతా రుణపడి ఉంటాం.
– ఉల్లి నాగరాజు, రైతు, చింతలపాలెం
ఉచిత విద్యుత్ రైతులకు వరం
ప్రభుత్వం అమలు చేస్తున్న 24గంటల ఉచిత విద్యుత్ రైతాంగానికి ఎంతో మేలు చేస్తున్నది. గతంలో రోజుకు 5,6 గంటల కరెంట్ సైతం సరఫరా అయ్యేది కాదు. వచ్చి పోయే కరెంట్‌తో మోటార్లు కాలిపోయేవి. వారం రోజులైనా ఒక మడికి సైతం నీరు అందేది కాదు. బిల్లు మాత్రం ఖచ్చితంగా వసూలు చేసేది. కాలం కలసి రాక మోటార్ బిల్లు కట్టకపోతే ఇంటి మీటర్లకు కరెంట్ సరఫరా నిలిపివేసేవారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఆ సమస్య లేదు. 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న సీఎం కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
-ఎండీ.మొహినోద్దీన్ పాష, రైతు, ఏనుబాముల
సీఎం కేసీఆర్ కరెంట్ కష్టాలు తీర్చిండు
గతంలో వ్యవసాయం చేయాలంటే భయపడేటోళ్లం. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక సీఎం కేసీఆర్ రైతులకు చేస్తున్న మేలుని చూసి వ్యవసాయంపై ఆసక్తి పెరిగింది. నా పొలం పక్క నుంచే 71డిబిం కాల్వలో గోదావరి జలాలు నిండుగా ప్రవహిస్తున్నాయి. దీనికి తోడు 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో కలిసొస్తున్నది. గతంలో ఎకరం వరి సాగు చేయగా ఈసారి అదనంగా మూడున్నర ఎకరాలు సాగు చేస్తున్నా. కరెంట్ కష్టాలు తీర్చి నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకు సారు పది కాలాల పాటు చల్లగా ఉండాలి.
– కడారి నరేశ్, రైతు, అర్వపల్లి
కరెంట్ కోసం గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం
గతంలో కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఎప్పుడు వస్తదో.. పోతదో తెలియకపోయేది. దానికోసం రాత్రి పగలు తేడా లేకుండా వ్యవసాయ బావుల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చేది. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఉచిత విద్యుత్ ఇస్తుండు. అప్పట్లో పంటలు పండకపోయినా బిల్లు కట్టేది. బావుల కాడ బిల్లు కట్టకపోతే ఇంటి మీటర్ తొలగించేది. ప్రస్తుతం కరెంటు కష్టాలు ఏమాత్రం లేవు. ఇదంతా సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైంది. మాకెంతో చేసిన సీఎం కేసీఆర్ వెంటే మేముంటాం.
– మాదిరెడ్డి శేఖర్‌రెడ్డి, దామెర, చౌటుప్పల్ రూరల్